హైదరాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర భాగం వ్యవహారం పురోగతి కనిపించడం లేదు. ఓ వైపు టెండర్లు పిలిచి ఏడాది గడుస్తున్నా బిడ్లు తెరవకపోగా, మారిన ప్రణాళికలకు అనుగుణంగా నిధులు విడుదల చేయలేదు. ఇక మరో ఐదు శాతం భూసేకరణకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు గతంలో భూములిచ్చిన వారు నష్టపరిహారం పెంచాలని కోరుతూ ఆందోళనలు చేస్తుండడంతో ప్రాజెక్టు ముందుకు కదలని పరిస్థితి నెలకొన్నది.
సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు సుమారు 162 కిలోమీటర్ల పొడవున ప్రతిపాదిత ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ (NHAI) గతేడాది డిసెంబర్లో టెండర్లు ఆహ్వానించింది. రూ.5,554.02 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును ఐదు ప్యాకేజీలుగా నిర్ణయించారు. తొలుత నాలుగు లేన్లుగా నిర్మించాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ పెరిగిన ట్రాఫిక్కు అనుగుణంగా ఇటీవల ఆరు లేన్లుగా మార్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీనే బిడ్లు తెరవాల్సి ఉన్నది. కానీ ప్రణాళిక మార్పు, నిధులు విడుదల కాకపోవడం, భూసేకరణ పూర్తికాకపోవడం తదితర కారణాలతో బిడ్లు తెరవలేదు. అయితే మళ్లీ టెండర్లు పిలువాలా? పాత బిడ్లనే కొనసాగించాలా? అనేదానిపై స్పష్టత లేదు. పాత బిడ్లతో న్యాయపరమైన చిక్కులుంటాయని, మళ్లీ టెండర్లు పిలిచే వీలున్నదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
మారిన ప్రతిపాదనలకు పీపీపీఏసీ ఆమో దం తెలుపాల్సి ఉన్నది. ఆ తర్వాత కేంద్రం బడ్జెట్ మంజూరు చేసే ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వంద శాతం భూసేకరణ పూర్తికాకుండా పనులు చేపట్టవద్దనేది పార్లమెంటరీ ప్యానల్ కేంద్రానికి చేసిన సిఫారసుల్లో కీలకమైనది. రోడ్డు ప్రాజెక్టులు సింహభాగం భూసేకరణ సమస్యలతోనే నిలిచిపోవడమే దీనికి కారణం. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాక, పెట్టిన ఖర్చు వృథా అవుతున్నది.
ఈ క్రమంలో కేంద్రం నిర్ణయం పై వేచిచూడాల్సి ఉన్నది. అదీగాక ఎన్డీయేయేతర రాష్ర్టాల విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తున్నదనే వాదన ఉంది. సీఎం సహా మంత్రులు రాష్ట్ర ప్రాజెక్టులపై పలుమార్లు విజ్ఞప్తిచేసినా ఫలితం లేకపోవడం దీనికి బలం చేకూర్చుతున్నది. ట్రిపుల్ ఆర్ ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలోనే చేపట్టాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభు త్వం అత్యుత్సాహంతో దక్షిణ భాగానికి అలైన్మెంట్ను రూపొందించి కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉన్నది.
కొత్త ప్లాన్ ప్రకారం ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.18,660 కోట్లు అవసరమవుతాయని ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించగా, కేంద్రం ఇప్పటికే రూ.7,104.06 కోట్లు మంజూరు చేసింది. 4,900 ఎకరాలు సేకరించాలి. భూసేకరణ ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలి. కాగా, చౌటుప్పల్, రాయగిరి ప్రాంతాల్లో ఇంకా భూములు సేకరించాల్సి ఉన్నది.
గతంలో భూములు ఇచ్చిన రైతులు కూడా ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో పరిహారం చెల్లింపు ముందుకు సాగడంలేదు. ఇందుకోసం కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్బిట్రేషన్ సైతం రైతుల విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపులో ప్రతిష్ఠంభన నెలకొన్నది.