పచ్చని సాగును ఫార్మా కంపెనీల కోసం, ఇథనాల్ ఫ్యాక్టరీల కోసం బలిపెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆవేదన చెందుతున్న రైతులపై ‘అధికార’ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నది. అడిగే అన్నదాతలపై లాఠీలను ఝళిపిస్తున్నది. లగచర్ల ఘటనను మరిచిపోకముందే సీఎం సొంతగడ్డపై మరోసారి రైతులు తిరగబడ్డారు.
గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ 12 గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడికి అధికార పార్టీ నేతలు అండగా నిలవడం ప్రజల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. ఆయనకు చెందిన ఫ్యాక్టరీపై రైతులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు.
ప్రజాపాలన పేరిట సాగుతున్న పోలీసు రాజ్యానికి నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో మరో దృష్టాంతం దొరికింది. భూభారతి సదస్సులో గోడు వెళ్లబోసుకుంటున్న వృద్ధ రైతును మెడపట్టి ఈడ్చుకుంటూ ఏఎస్సై బయటకు తోసేశాడు.
రంగారెడ్డి జిల్లాలో ఫార్మా పేరిట భయకంపిత వాతావరణాన్ని సృష్టిస్తున్న రేవంత్ సర్కార్.. అంతటితో ఆగకుండా 1847 మంది రైతుల ప్లాట్ల నుంచి గ్రీన్‌ఫీల్డ్ పేరిట రాకాసి రహదారిని నిర్మిస్తున్నది. ఎనికెపల్లిలో గోశాల పేరుతో పంట పొలాలపై కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అడ్డొచ్చిన రైతులపై దౌర్జన్యానికి తెగపడుతున్నది. గోశాలపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోకముందే పొలం దున్నే రైతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించింది.
మహబూబ్‌నగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలను విధ్వంసం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యులు నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానిక రైతులు తిరగబడ్డారు. చంద్రబాబు శిష్యులైన ఏపీకి చెందిన టీడీపీ నేతలు శ్రీనివాసులు జబ్బల, శ్రీసా యి జబ్బల అధికార కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలతో గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టారు. కంపెనీ యాజమాన్యం ప్రైవేట్ సైన్యానికి తోడు భారీగా పోలీసులను మోహరించి బుధవారం నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించగా, అడ్డుకునేందుకు తెల్లవారుజామునే పలు గ్రామాల రైతులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఏపీ టీడీపీ నేతలకు చెందిన ‘గాయత్రి రెన్యువబుల్ ఫ్యూయల్స్ అల్లాయిడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్’ క్యాంపు కార్యాలయంపై దాడిచేశారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన షెడ్లను, వాహనాలను ధ్వంసం చేశారు. కంటెయినర్‌ను పెకిలించి వేసి నిప్పు పెట్టారు. రైతుల ఆగ్రహాన్ని చవిచూసిన ఫ్యాక్టరీ యాజమాన్యం పలాయనం చిత్తగించింది. పోలీసులు మాత్రం సాయంత్రం గ్రామాల మీద విరుచుకుపడి, దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేశారు.
పచ్చని పొలాల మధ్య కాలుష్యం వెదజల్లే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు అంటూ పెద్ద ధన్వాడ రైతాంగం తిరగబడింది. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఏర్పాటుచేస్తున్న ‘గాయత్రి రెన్యవ బుల్ ఫ్యూయల్స్ అల్లాయిడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్’ (జీఆర్ఎఫ్) క్యాంపు కార్యాలయంపై పలు గ్రామాల ప్రజలు దాడి చేశారు. ఫ్యాక్టరీ నిర్మించొద్దని స్థానికులు గత కొంతకాలంగా కోరుతున్నప్పటికీ, లెక్కచేయకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం పనులు చేపడుతున్నది. దీంతో ఆగ్రహించిన పెద్ద ధన్వాడ, దాని చుట్టుపక్కల నాలుగు గ్రామాల ప్రజలు తెల్లవారుజామునే ఫ్యాక్టరీ నిర్మాణ స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. అప్పటికే కంపెనీ ప్రతినిధులు ప్రైవేట్ సైన్యంతోపాటు భారీ పోలీసు బందోబస్తు మధ్య పనులు ప్రారంభించేందుకు సిద్ధమమయ్యారు. రైతులు ఆందోళనకు దిగుతారన్న సమాచారంతో పోలీసులు ముందుగానే ఆయా గ్రామాల శివారుల్లో రైతులెవ్వరూ బయటికి రాకుండా కాపు కాశారు. విషయం తెలుసుకున్న రైతులు పొలాల గట్ల వెంబడి ఫ్యాక్టరీ నిర్మాణ ప్రదేశానికి చేరుకున్నారు. ఒక్కసారిగా అక్కడకు చేరుకున్న రైతులను చూసిన పోలీసులు వెనక్కుతగ్గారు. అక్కడే ఉన్న కంపెనీ ప్రతినిధుల కారును అడ్డగించిన రైతులు.. వ్యవసాయం చేసుకోవడానికంటూ మా భూములు కొనుక్కొని, ఇప్పుడు కంపెనీ పెడతారా? అంటూ నిలదీశారు.
కారులో ఉన్న కంపెనీ యజమానిపై, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడంతో వారు అక్కడినుంచి పారిపోయారు. ఈ సందర్భంగా తాత్కాలికంగా ఏర్పాటుచేసిన షెడ్లను రైతులు ధ్వంసం చేశారు. వాహనాలు, హిటాచీలపై కూడా రాళ్లు రువ్వారు. అంతటితో ఆగకుండా కంపెనీ ప్రతినిధుల కోసం ఏర్పాటుచేసిన కంటైనర్‌ను పెకిలించి నిప్పు పెట్టారు. దాడికి దిగుతున్న సమయంలో పోలీసులు అడ్డుచెప్పే ప్రయత్నం చేయగా.. రైతులు వారిని పక్కకు నెట్టేసి.. ‘మా బతుకులు ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోం.. చచ్చినా ఫ్యాక్టరీ మాకొద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రైతాంగం ఫ్యాక్టరీ నిర్మించే ప్రదేశంలో ఆందోళన కొనసాగించింది. ఇదిలా ఉండగా జీఆర్ఎఫ్ కంపెనీ యజమాని ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా, స్థానిక అధికార పార్టీ నేతలు ఈ కంపెనీ ఏర్పాటుకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి నిదర్శనంగా బుధవారం కనీవిని ఎరుగని రీతిలో గద్వాల డీఎస్పీ మొగులయ్య ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేయడం, దగ్గరుండి కంపెనీ పనులు ప్రారంభించాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
గ్రామాలపై విరుచుకుపడ్డ పోలీసులు
కాగా, రైతులు దాడులు చేస్తున్నంత సేపు వీడియోలు తీసిన పోలీసులు.. ఆ తర్వాత సాయంత్రం గ్రామాలపై పడి అరెస్టులపర్వం కొనసాగించారు. గ్రామాల్లో దొరికిన వారిని దొరికినట్టు చితకబాదుతూ రాజోళి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి 8 గంటల వరకు సుమారు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేశారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసుల దాడులతో చుట్టుపక్కల గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. గ్రామాల్లో ఉన్న మహిళలు పిల్లలతో కలిసి పొలాల్లో దాక్కున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాలన్నీ పోలీసుల చక్రబంధంలో ఉన్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కాగా పెద్ద ధన్వాడలో ఏర్పాటుచేస్తున్న కంపెనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తున్నారని తెలుసుకొని ఉదయం నుంచి ముందస్తుగా వారిని గృహనిర్బంధంలో ఉంచారు. గద్వాల, అయిజ, అలంపూర్ ఇతర ప్రాంతాల్లోని బీఆర్ఎస్ నేతలను బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయొద్దని, ఇప్పటికైనా రైతుల ఆగ్రహం చూసి అనుమతులు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జోగుళాంబ గద్వాల జిల్లాలో ఫ్యాక్టరీ వ్యతిరేక స్వరం ఎక్కువైంది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ..
పెద్ద ధన్వాడ గ్రామంలో 27.5 ఎకరాల్లో ఏపీకి చెందిన జీఆర్ఎఫ్ కంపెనీ.. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అనుమతులు తీసుకున్నది. ఫ్యాక్టరీ యజమానులు తాము వ్యవసా యం చేసుకోవడానికి పొలాలు కావాలంటూ 2017లో తక్కువ ధరకు భూములను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రైతులను మోసం చేసి ఏకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అనుమతులు తీసుకొచ్చారు. దీంతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టొద్దంటూ నాలుగు నెలల నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని 12 గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. రైతుల పక్షాన ఉంటామని చెప్పి దీక్షను విరమింపజేశారు.
తెల్లవారుజామునే పోలీసులతో దిగ్బంధం
ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకోవడానికి రైతులు అక్కడికి వెళ్తున్నారని తెలుసుకున్న పో లీసులు పెద్ద ఎత్తున తమ బలగాలను మోహరించారు. పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని 12 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుంటే, రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులు కూడా కంపెనీ యాజమాన్యానికి సహకరిస్తూ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కంపెనీ యాజమాన్యం పనులు ప్రారంభించడానికి ముహూర్తం ఎంచుకోవడంతో రైతులను కట్టడి చేసేందుకు భారీ ప్రణాళిక రచించారు.
పోలీసులపై తిరగబడి..
పోలీసుల బెదిరింపులు, హెచ్చరికలను లెక్కచేయని వందలాది మంది రైతులు కంపెనీ నిర్మాణ ప్రదేశానికి తరలివచ్చారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటుచేసిన షెడ్లు, వాహనాలు, హిటాచీలను ధ్వంసం చేశారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో వారిని అడ్డుకునేందుకు మహిళా పోలీసులను రంగంలోకి దింపారు. రైతులు ఆగ్రహంతో ఊగిపోతూ కంటైనర్‌ను పల్టీలు కొట్టిం చి నిప్పుపెట్టారు. పెద్ద ధన్వాడలో జరిగిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం పోలీసులకు ఎలా తెలిసింది? అంత భారీ బందోబస్తు ముందుగానే ఏర్పాటుచేయడం వెనుక ఎవరి హస్తం ఉన్నది? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ధన్వాడ తదితర గ్రామాల రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో వారికి అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. జోగుళాంబ-గద్వాల జిల్లాలో అనేకమంది బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధంలో ఉంచారు. గద్వాల జిల్లా కేంద్రంలోని సాట్స్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, విజయ్‌కుమార్ తదితర బీఆర్ఎస్ నేతలను, అయిజలో నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కురువ పల్లయ్య తదితర నేతలను ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దంటూ హుకూం జారీచేశారు. రైతుల పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నామని, పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఇథనాల్ ఫ్యాక్టరీలో మాజీ ఎమ్మెల్యేకు వాటాలు
జోగుళాంబ గద్వాల జిల్లాలో పచ్చని పొలాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ వెనుక అధికార పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ కంపెనీలో సదరు నేతను ప్రధాన వాటదారుగా చేర్చుకున్నారని, అందుకే కంపెనీ నిర్మించేందుకు పూర్తిస్థాయిలో అండదండలు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. పథకం ప్రకారమే రైతులను ఒప్పించి.. ఆందోళన విరమింపజేసి ఆ తర్వాత.. సద్దుమణిగాక భారీ పోలీసు బందోబస్తుతో కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గత రెండు రోజులనుంచి ఫ్యాక్టరీ పనులు మళ్లీ మొదలవుతున్నాయని, అక్కడికి వెళ్తే చాలా ప్రమాదం అని కొందరు కాంగ్రెస్ నేతలతో సమీప గ్రామాల్లో ప్రచారం చేయిస్తున్నారు.
అంతేకాకుండా కొంతమంది పోలీసులతో బెదిరింపులకు దిగారు. ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయడం, అధికార యంత్రాంగం సమీప ప్రాంతానికి రాకపోవడం అనుమానాలకు తావిస్త్నుది. ఇంత జరుగుతున్నా రైతులను జైలు పాలు చేసి ఫ్యాక్టరీ నిర్మించాలని సదరు మాజీ ఎమ్మెల్యే పట్టుబడుతున్నట్టు పోలీస్ అధికారులే అంటున్నారు. సదరు నేత ఒత్తిడితోనే పోలీస్ అధికార బలం ఉపయోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తమ ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ, ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని రైతులు భీష్ముంచుకు కూర్చున్నారు. కాలుష్యం వదజల్లే ఈ ఫ్యాక్టరీకి అధికార పార్టీ నేతలు అండదండలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, జైలుకు పంపాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది.
ఫ్యాక్టరీ యజమానులు చంద్రబాబు శిష్యులే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడి కోసం తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలపై మరణశాసనం రాస్తున్నారు. ఇక్కడి రైతాంగానికి వ్యతిరేకంగా పచ్చని పొలాల్లో కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ కోసం రాచబాటలు వేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ.. ఏపీలోని టీడీపీ నాయకులైన శ్రీనివాసులు జబ్బల, శ్రీసాయి జబ్బలకు చెందినది. వీరు ఏపీ సీఎం చంద్రబాబుకు శిష్యులు. తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన అలంపూర్ నియోజకవర్గంలో భారీ పెట్టుబడులతో ‘గాయత్రి ఇండస్ట్రీస్ రెన్యువబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరు మీద అనుమతులు తీసుకున్నారు. ఈ ప్రైవేట్ కంపెనీ 2023 ఫిబ్రవరి 23న ఏంసీఏతో విలీనం అయింది.
గాయత్రి ఇండస్ట్రీస్ రెన్యువబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.39 కోట్ల అధీకృత షేర్ క్యాపిటల్ కలిగి ఉన్నదని, దీని మూలధనం రూ.29,48,67,000తో రిజిస్టర్ చేయబడిందని చెప్తన్నారు. ఈ కంపెనీకి ఇద్దరు డైరెక్టర్లు/కీ మేనేజ్మెంట్ పర్సన్స్‌గా ఏపీకి చెందిన టీడీపీ నేతలు శ్రీనివాసులు జబ్బల, శ్రీసాయి జబ్బల వ్యవహరిస్తున్నా రు. కంపెనీ రిజిస్ట్రేషన్ నంబర్ 110435. ఎంసీఏ నుంచి అందించబడిన కార్పొరేట్ గుర్తింపు సంఖ్య(సీఐఎన్)ను యూ19201 ఏపీ2023పీటీసీ110435గా పేర్కొన్నారు. గాయత్రి పునరుత్పాదక ఇంధనాలు అలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కోక్, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణలో అనుమతి తీసుకున్నారు. ఈ కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం అడ్రస్‌ను హౌస్ నంబర్ 7-82, ఎగువ కురవంక, మదనపల్లె సొసైటీకాలనీ, చిత్తూరు, మదనపల్లె, ఆంధ్రప్రదేశ్‌గా పేర్కొన్నారు.
గ్రామాలపై పోలీసుల జులుం
రాజోళి మండలంలో ఆందోళనకు ది గిన రైతులను అదుపులోకి తీసుకొని పో లీస్స్టేషన్లకు తరలించారు. రాజోళి పోలీస్‌స్టేషన్ ముందు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మీడియాను కూడా దగ్గరికి రానివ్వ లేదు. పోలీసుల చర్యలతో భయభ్రాంతులకు గురై చాలామంది గ్రామాలు వదిలి వెళ్లిపోయారు. కొంతమంది మహిళలు పిల్లలను తీసుకొని పొలాల వెంబడి దాక్కుంటున్నట్టు సమాచారం. తమ ప్రాణం పోయినా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనివ్వబోమని రైతులు శపథం పూనారు. ఫ్యాక్టరీ యజమానితో పలువురు నాయకులు కుమ్మక్కై మళ్లీ పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.