హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): కాలుష్యాన్ని వెదజల్లుతున్న రసాయన పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లి మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఏండ్ల తరబడి ఆందోళన కార్యక్రమాలు చేయడంతోపాటు సమస్య తీవ్రతను ఇప్పటికే పలుమార్లు పీఎం వో, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, హైకోర్టు, పార్లమెంట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా కాలుష్యకారక పరిశ్రమలపై చర్య లు చేపట్టడం లేదని వాపోతున్నారు.
దీనిపై అంతమ్మగూడెం గ్రామానికి చెందిన రైతు గుమ్మి దామోదర్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం పలువురు రైతులు ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారితోపాటు సీఎంవో, ఈఎఫ్‌ఎస్‌టీ, పీసీబీ మెంబర్ సెక్రటరీ కార్యాలయాల్లో మరోసారి ఫిర్యాదు అందజేశారు. అంతమ్మగూడెం, ఆ చుట్టుపక్క ప్రాంతాల్లోని శ్రీజయ, వినీత్, హజేలో, బృందావన్ లాబొరేటరీస్ పరిశ్రమల నుంచి విపరీతంగా కాలుష్యం వెలువడుతున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతమ్మగూడెం, ఆ చుట్టుపక్క ప్రాంతాల్లోని కాలుష్యకారక పరిశ్రమలకు గతంలో ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ రూపంలో రూ.4 కోట్ల జరిమానా విధించి, రూ.3.15 కోట్లకుపైగా వసూలు చేశారని, కా లుష్యాన్ని గుర్తించేందుకు ఆ నిధులతో వెంటనే కంటిన్యువస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ (సీఏఏక్యూఎం) సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.