పత్తి కొనుగోళ్ల తీరుపై రైతులు భగ్గుమంటున్నారు. సర్కార్ కొర్రీలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎకరాకు 12 క్వింటాళ్లకు బదులు కేవలం 7 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ సోమవారం పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు.
మహబూబ్‌నగర్/నల్లగొండ, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆదిలాబాద్, (నమస్తే తెలంగాణ): పత్తి రైతులు (Cotton) రోడ్డెక్కారు. సీసీఐ (CCI) కొర్రీలపై కన్నెర్రజేశారు. సోమ వారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లి శివారులోగల బాలాజీ మిల్ వద్ద రాయిచూర్ హైవేపై ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి రైతులు గంటసేపు బైఠాయించారు. జోగుళాంబగద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని శ్రీవరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో సీసీఐ అధికారుల తీరుపై ఆగ్రహంతో రైతులు జాతీయ రహదారిపై గంటసేపు రాస్తారోకోకు దిగారు. నారాయణపేట జిల్లా లింగంపల్లి సమీపంలోని భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీలో పత్తి కొనుగోళ్లను అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపై వాహనాలను అడ్డంగా ఉంచి ధర్నా చేపట్టారు. ఊట్కూరు మండల రైతులు అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ చేసుకుని వాహనాలలో పత్తి లోడుతో విజయ కాటన్ ఇండస్ట్రీకి చేరుకోగా.. రైతు నుంచి 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని కొత్త నిబంధన పెట్టడంపై ఆగ్రహించారు.
మిల్లు ఎదుట ప్రధాన రహదారిపై గంటపాటు ధర్నాకు దిగారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నదని పత్తిని కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంలోని బాలాజీ జిన్నింగ్ మిల్లు ఎదుట రోడ్డుపై పత్తికి నిప్పంటించారు. వర్షం కురిసినా రైతులు ఆందోళన కొనసాగించారు. ఆందోళనలతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. కాగా ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున స్లాట్ బుక్ చేసుకున్న రైతులు సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో భారీగా పంటను విక్రయించడానికి తీసుకొచ్చారు. కొనుగోళ్లు ప్రారంభించగా.. ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసేలా సీసీఐ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడంతో రైతులు పంటను విక్రయించే అవకాశం లేకుండా పోయింది. సాఫ్ట్‌వేర్‌లో అనుమతించడం లేదని మార్కెటింగ్ సిబ్బంది తెలుపడంతో రైతులు సీసీఐ, మార్కెటింగ్ అధికారులను నిలదీశారు. దాదాపు రెండు గంటలపాటు పంట కొనుగోళ్లు నిలిచాయి. చివరకు వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరణ పత్రాలతో సీసీఐ ఆధ్వర్యంలో పంట కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
కలెక్టర్ కాళ్ల మీద పడ్డ రైతు 
పత్తి కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు సోమవారం సాయంత్రం నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి మర్రిగూడ మండలంలోని శ్రీలక్ష్మీ నర్సింహ ఆగ్రో ఇండస్ట్రీలోని సీసీఐ కేంద్రానికి రాగా.. అక్కడ ఉన్న రైతులు తమ గోడువెళ్లబోసుకునేందుకు ప్రయత్నించారు. ఇదే మండలం ఎర్రగండ్లపల్లికి చెందిన వీరమళ్ల కృష్ణయ్య అనే రైతు తన పత్తిని తిరస్కరించారని ఆవేదన వ్యక్తంచేస్తూ కలెక్టర్ కాళ్ల మీద పడే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న అధికారులు రైతును పైకి లేపారు. కానీ రైతు మాత్రం.. తన ఆవేదన వినాలంటూ వేడుకున్నాడు. ‘మేడం మీ కాళ్లు మొక్కుత. నాలుగువేలు కిరాయి పెట్టి ట్రాక్టర్ నింపుకొచ్చిన. నా పత్తి తేమ శాతం 14 వచ్చింది. వాతావరణం అనుకూలిస్తలేదు. కాయకష్టం చేస్తున్నం. నేను రైతును మేడం. ఎవ్వరి సొమ్మును తినేటోన్ని కాదు. పట్టా కిరాయితో కలిపి ఒక్క కూలీకే రోజుకు రూ.600 అవుతుంది. ఇక్కడికి తీసుకొస్తే పత్తి తేమ శాతం 14 వచ్చింది. తేమ ఎక్కువ ఉందనుకుంటే క్వింటాలుకు రూ.300 రేటు తగ్గియుండ్రి. కానీ పత్తిని వాపస్ పంపకండి మేడం. 14 తేమ శాతం కూడా కొనాలి మేడం. ప్లీజు మేడం’ అంటూ కృష్ణయ్య వేడుకున్నాడు.