వరంగల్, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం.. ఆపై ప్రజాప్రతినిధుల నోటిదురుసు అధికారులకు శాపంగా మారుతున్నది. క్షేత్రస్థాయిలో సమస్య వచ్చినప్పుడు, ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైనప్పుడు, తమ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు ఏం చేయాలో తోచక ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా ప్రతి ఒక్కరూ అధికారులపై విరుచుకుపడటం సర్వసాధారణం అయిందని అధికారులు వాపోతున్నారు. యాసంగి ధాన్యం ప్రత్యేకించి మక్కల కొనుగోళ్ల విషయంలో రేవంత్ సర్కార్ది మొదటి నుంచీ ముం దుచూపు లేనితనంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకించి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు అరిగోస పడుతున్నా రు. సీజన్ ప్రారంభానికి ముందే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ పంట దిగుబడిని తీసుకొచ్చేదాకా పట్టనట్టు వ్యవహరించిన ప్రభుత్వం గత నెల తొలివారంలో రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మార్క్ఫెడ్ డీఎంలను బదిలీ చేసింది.
సకల ఏర్పాట్లు చేస్తున్నామనే సంకేతాలిచ్చి తద్వారా ప్రచారం చేసుకోవడానికి మాత్రం బదిలీలు చేసింది కానీ, కొనుగోలు కేంద్రాలు, గోదాముల్లో పంటలను కాంటా పెట్టేందుకు, ఎగుమతి, దిగుమతి చేసుకునేందుకు అతిముఖ్యమైన హమాలీలు, అవసరమైన గన్నీ సంచులను సమకూర్చుకోలేదు. క్షేత్రస్థాయిలో ఇలాంటి మౌలిక అంశాల మూలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వీటిపై దృష్టిసారించాలని వారం క్రితం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీ క్షా సమావేశంలో ఓ జిల్లాస్థాయి అధికారి ప్రజాప్రతినిధులతో మొరపెట్టుకున్నారని తెలిసింది. ఈ సమీక్షా సమావేశమైన రెం డు రోజులకు వరంగల్ జిల్లాకు చెం దిన ఒక ప్రజాప్రతినిధి ‘నా నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు నాపై తీవ్ర ఆగ్రహంతో ఉండటానికి కారణం నువ్వే!’ అంటూ మార్క్ఫెడ్ అధికారిపై నోరుపారేసుకున్నారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు అధికారి తాను పనిచేయలేనని తన ఉన్నతాధికారికి తెగేసిచెప్పినట్టు సమాచారం. దీంతో వేరే జిల్లాకు చెందిన అధికారికి కొనుగోళ్ల అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.