అన్నదాతది.. ఆగం పరిస్థితి. కాలం కత్తికట్టినా తట్టుకుని నిలబడుతున్నడుగానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిలువునా ముంచుతున్న తీరునుంచి తేరుకోవడం ఆయన వల్ల కావడం లేదు. మాటకారి తనం, ఆర్భాటంతో అధికారంలోకి వచ్చిన రేవంత్ అండ్ టీం రైతన్నను నిలువునా ముంచుడు తప్ప అక్కరకొచ్చే పనేది చేసిన పాపాన పోవ డంలేదు. ఊ.. అంటే పథకాల పేర్లు మార్చుడు, ఆ.. అంటే బూతులతో అదరగొట్టుడు తప్ప సొంతంగా చేసేది లేదు. రైతులకు ప్రయోజనాలు కలిగించేది అంతకన్నా కనిపించడం లేదు. బీఆర్ఎస్ను అనుకరిస్తే నామోషీ అనుకుని ప్రతీది కొత్తదానిగా పాతవాటినే పాతరపెట్టే పనిచేస్తున్నరు తప్ప సాఫీగా సాగుతున్న పని ఒక్కటంటే ఒక్కటీ లేదు. రైతులను రాజులుగా చేయాలని కేసీఆర్ కలలుగని కొత్త ఆలోచనలతో ముందుకెళ్తే, నిండా ముంచడానికే కంకణం కట్టుకున్నట్టు రేవంత్ చర్యలతో తెలుస్తున్నది.
పదేండ్లలో ఓ తీరుగా మలిచిన బీఆర్ఎస్ సర్కార్ తీరును, కేవలం రెండేండ్లలో కూకటివేళ్లతో కూల్చేందుకు రేవంత్ చర్యలు ప్రేరేపిస్తుండటంతో అన్నదాత మళ్లా ఉమ్మడి పాలనను గుర్తుచేసుకుంటున్నాడు. కాంగ్రెస్ హయాంలో వేద్దామంటే విత్తనాలుండవు. చల్లుదామంటే ఎరువులు దొరుకవు. పారిద్దామంటే నీళ్లు రావు. ఎండబోద్దామంటే ఏర్పాట్లు కనిపించవు. అమ్ముకుందామంటే కొనే సౌలత్ లేదు. ధర పలుకుద్దేమో అనుకుంటే దగా చేయడం తప్ప మరేమీ కానరాదు. ఇలా సాగు షురూ చేసింది మొదలు, శ్రమను అమ్ముకుందామనుకునే వరకు ఏడ్వని దినం లేదు. గోసపడని ఘడియ లేదు. మొత్తంగా అన్నదాత అరిగోసతో రాష్ట్ర ఎవుసం రందిలో కూరుకుపోతున్నది. ఏతావాతా రేవంత్ సర్కార్ తీరు ఎలాఉందంటే ఎన్నికల కోసం ఏమేమో చెప్తాం.. అన్నీ చేస్తామా? అన్నట్టు తయారైంది.
రేవంత్ సర్కార్ రుణమాఫీలో కాకి లెక్కలు చెప్పి రైతన్న వెన్నువిరిచింది. పూటకో మాట, గడియకో తీరుతో అన్నదాత నోట్లు మాఫీకాని రుణపు మట్టిపోసింది. యేటికేడు పెరగాల్సిన లబ్ధిదారుల సంఖ్య నానాటికి తగ్గిస్తూ తామేదో ఘనకార్యం చేసినట్టు కాకిలెక్కలు చూపి బక్కచిక్కిన రైతును పీకల్లోతుకు నెట్టింది. మాటకు, చేతలకు పొంతన లేదనే తమ ఘనకీర్తిని మరోమారు గుర్తుచేస్తూ అర్హుల సంఖ్యను అంతకంతకు తగ్గించి తీవ్ర అన్యాయం చేసింది రేవంత్ ప్రభుత్వం. గెలిస్తే ఏదో జరుగబోతుంది, ఎంతోకొంత చేస్తారని ప్రకటించారు. చేయకపోతారా? అని నమ్మిన రైతన్నను నట్టేట అనేకంటే నిండా ముంచి ఊపిరి తీశారు రేవంత్ అండ్ టీం. మాఫీ ముచ్చట దేవుడెరుగు, రుణాలిచ్చేటోడు లేక రోడ్డెక్కాల్సిన దుస్థితి. అధికారంలోకి వస్తాం.. రాగానే అలా వెళ్లి ఇలా లోన్ పట్టుకుని రండి.. అని చెప్పిన మాటలు నమ్మినందుకు లోపలికే కూరుకుపోయామని నేటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రైతాంగం.
భరోసాకే భరోసా లేకుండాపోయింది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వా త మాటమార్చింది. కొసరు మాట దేవుడెరుగు అసలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా చేసి తన మార్క్ రాజకీయాన్ని జ్ఞాపకం చేస్తున్నది. పంట సాగుకు ముందే బీఆర్ఎస్ సర్కార్ పంట సాగుకు రైతుబంధు విడుదల చేసి పండుగ వాతావరణాన్ని అందిస్తే రేవంత్ ప్రభుత్వం సాయం మాట అటుంచి ఇవ్వాలన్న సోయి కూడా లేకుండా కాలం వెళ్లదీస్తున్నది. బంధు అనే పేరును భరోసాగా మార్చినంత ఈజీగా పని అవుతుందనుకున్నారో ఏమోగానీ రంగంలోకి దిగిన తర్వాత విషయం తెలుసుకుని రైతుకు ‘సాయం’ ఎగ్గొట్టింది. ఎకరాకు రూ.7,500 ఏమోగానీ కనీసం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 6వేలకే దిక్కులేకుండా పోయింది.
సీజన్‌కు ఒక్కసారి విడుదల చేయాల్సింది ఇప్పటివరకు గడిచిన ఐదు సీజన్లకూ కేవలం రెండుసార్లు మాత్రమే మొక్కుబడిగా ఆరువేల చొప్పున మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నది. ఆ ఇచ్చిన సందర్భం కూడా ఏదైనా ఎలక్షన్ ఉంటే తప్ప ఇవ్వడం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే తప్ప మరేమీ లేదని చేతల్లో నిరూపించింది. కాగా, ఈ యాసంగిలో కేవలం సాగు చేస్తున్న భూమికే సాయం అనే ధోరణిలో వెళ్లాలనే ఆలోచన చేస్తుందనే ముచ్చటతో రైతులు మరింత నిరాశలో కుంగిపోతున్నారు.
రైతాంగం పరిస్థితి పంటాపాయె.. పరిహారమూ రాకపాయె.. అన్నట్టుగా తయారైంది. రైతులను మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ సర్కారు బీమాతో మరో మోసానికి తెర తీసె. పంటల బీమా అమల్లోనూ రైతులను మోసం చేసింది. ‘అధికారంలోకి వచ్చిన తక్షణమే పంటల బీమాను అమలు చేస్తాం. నష్టపోయిన రైతులకు తక్షణం పరిహారం అందిస్తాం’ అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయినా ఇప్పటికీ పంటల బీమా పథకం అమలుకు నోచుకోలేదు. బీమాలో రైతుల వాటాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందంటూ గొప్పగా ప్రకటించిన మంత్రి తుమ్మల మాటలు నీటిమూటలే అయ్యాయి. ఆరుగాలం కష్టం చేసిన పంటలు వర్షార్పణం అవుతున్నా బీమా లేక రైతులు బేజారవుతున్నారు.
రైతుల కోసం కేవలం రూ. 1200 కోట్లు చెల్లించలేక ఈ పథకాన్ని పక్కనపెట్టడం గమనార్హం. రెండేండ్లలో అధికారిక లెక్కల ప్రకారం 10 లక్షల ఎకరాలే కావొచ్చుగానీ, అనధికారికంగా మాత్రం సుమారు 20-25 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్లు అంచనా. తప్పుడు లెక్కల ప్రకారం మొత్తంగా రైతులకు రూ.8వేల కోట్ల భారీ నష్టం జరిగినట్టు అంచనాలున్నాయి. అదీకాకుండా నష్టోయిన రైతులకు ఎకరాకు రూ. 10వేల చొప్పున పరిహారం ఇస్తామన్న హామీ అటకెక్కింది. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పర్యటించి నష్టపోయిన పంటల్ని పరిశీలించి పరిహారం ప్రకటించినా అమలుకు మాత్రం అతీగతీ లేకుండా పోయింది.

సహజంగా తెలుపు రంగులో ఉండే యూరి యా కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని ఎర్ర రంగును అద్దుకున్నది. అవసరం ఉందని దుకాణానికి వెళ్లిన అన్నదాత రక్తం కండ్ల చూడకుండా ఎరువు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్క బస్తా కోసం కూడా యుద్ధాలే చేశారు. మళ్లా పాత రోజుల మాదిరిగా పనంతా వదిలి లైన్ల నిలబడడం నిత్యకృత్యమైంది. కేసీఆర్ హయాంలో విరివిగా దొరికిన యూరియా బస్తాలు, రేవంత్ వ్యవహారంతో కొరతపడ్డాయి. చెప్పులు, గొడుగులు, పాస్ బుక్కులు, పోలీస్ పహారా సర్వసాధారణమైంది. బస్తాల కోసం జరిగిన గొడవల కారణంగా వందల సంఖ్యలో రైతులకు తీవ్ర గాయాలు కాగా సుమారు ఐదుగురు అన్నదాతలు ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు.
కేవలం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో తీవ్రస్థాయిలో యూరియా కొరత ఏర్పడినా తమకేమీ తెలియనట్టు, మరేమీ పట్టనట్టుగా వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవసరం ఉన్న ఎరువులకు ఆంక్షలు పెట్టి ఆడుకోవడం అటు సెంట్రల్, ఇటు స్టేట్ సర్కార్లకు సర్వసాధారణమైంది. మొత్తంగా సరైన సమయానికి ఎరువులు దొరక్కపోవడంతో దిగుబడి తగ్గడమే కాకుండా తీవ్ర నష్టం మూటగట్టుకోవడం రేవంత్ సర్కార్ రైతన్నకు ఇచ్చిన బహుమతిగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సర్కార్ సాయం చెయ్యా చెయ్యదు సరే., కనీసం కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటను కొనే ఏర్పాట్లూ చేయకపోవడంతో అన్నదాత ఆగమవుతున్నాడు. తేమ, తాలూ.. అంటూ ఏవేవో కొర్రీలు పెడుతూ అటు కేంద్ర సర్కార్, ఇటు హస్తం ప్రభుత్వం నెపం పరస్పరం నెట్టేసుకుంటూ తెలంగాణ అన్నదాతను ఎటూకాకుండా చేస్తున్నాడు. మద్దతు ధరలో ముఖం వాచి ఉన్న అన్నదాత సరైన సమయానికి కొనుగోళ్లు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులుపడుతున్నాడు. పత్తికి రూ.8110 ధరగా నిర్ణయించినా పట్టించుకునే యంత్రాంగం లేకపోవడంతో అన్నదాతలు దిక్కులేక కేవలం రూ.6నుంచి 7 వేలకు అమ్ముకుని తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. ఇక మిగతా పంటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్టుగా తయారైంది. పంటలు కొంటే ఎక్కడ డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తుందోనని తప్పించుకునేందుకే ప్రయత్నిస్తూ రేవంత్ ప్రభుత్వం అన్నదాతతో ఆటలాడుతున్నది. మొక్కుబడిగా సోయా, మొక్కజొన్నలను కొంటూ మమ అనిపిస్తున్నారు.
‘రైతులు పండించే ప్రతి పంటనూ కొనుగోలు చేస్తాం. 10 పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ కూడా ఇస్తాం. పంటను బట్టి క్వింటాలుకు రూ. 300 నుంచి రూ. 500లు బోనస్ ఇస్తాం. రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం’ అంటూ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కింది. బోనస్ సంగతేమోగానీ కనీసం మద్దతు ధర కూడా కల్పించలేక చేతులెత్తేస్తున్నది. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం ధాన్యానికే వర్తిస్తుందని, అందునా సన్న ధాన్యానికే తప్ప దొడ్డుకు ససేమిరా అన్నట్టుగా చెప్తూ మొండి చేయి చూపుతున్నది. వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, జొన్న ఇలా చెప్పిన పంటలన్నింటికీ బోనస్ తుస్సు మనిపించింది. ప్రకటించిన లెక్కలు, ఇచ్చిన రొక్కానికి పొంతన లేకుండా చేసింది. మొన్నటి యాసంగికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రూ.1,200 కోట్లను ఆరు నెలలైనా ఇంకా చెల్లించకుండా అటకెక్కించడమే కాక ప్రస్తుతం వానకాలం కొనుగోళ్లలోనూ అరకొరగా ఇస్తున్నది.
కాంగ్రెస్ పాలనలో కౌలు రైతు ముచ్చట ఎంత తక్కువు చెప్పుకుంటే అంత మంచిదన్నట్టు మారింది. రైతులతో సమానంగా కౌలు రైతుకూ భరోసా ఇస్తామని ప్రకటించిన మాటలతో గాల్లో తేలిన రైతులకు నిరాశే మిగిలింది. ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పిన సర్కార్ కనీసం ఆ దిశగా ఆలోచన కూడా చేసిన పాపాన పోవడం లేదు. తమ గోడు ఏమైంది సారూ? అని సంబంధిత రైతులు లేఖలు రాసినా.. ఉలుకూపలుకు లేకుండా సర్కార్ సైలెంట్ అయింది. కాంగ్రెస్ సర్కారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ధోకా ఇవ్వడంతో అంతా తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికీ సీఎం నోటెంటా కౌలు రైతు ముచ్చటే రాకపోవడం చూస్తుంటేనే వారంటే ఎంతప్రేముందో అర్థమవుతున్నది.

