మూసాపేట(అడ్డాకుల) : రైతుల సమస్యలు సులభంగా పరిష్కరించే విధంగా తీసుకు వచ్చిన గొప్ప చట్టం
భూ భారతి ఆర్వోఆర్ చట్టమని దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి (MLA Madhusudhan Reddy) అన్నారు. సోమవారం అడ్డాకుల మండలం సంత బజార్ల, మూసాపేట మండలం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో భూ భారతి (Bhu Bharati) కొత్త చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
పాత చట్టాల వల్ల రైతుల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. నిపుణులు, మేధావులతో చర్చించి 12 రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి ఆ చట్టాల్లో ఉన్న మంచిని తీసుకొని భూభారతి చట్టాన్ని రూపొందించిందని వెల్లడించారు. భూ భారతి చట్టంలో ఉన్న నిబంధనలను వివరించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రెవెన్యూ అధికారులు చిత్త శుద్ధితో భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
అకాల వర్షంతో తడిసిన ధాన్యం ను కూడా కొనుగోలు చేస్తామని వివరించారు. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై ఈ నెల 17 నుండి 29 వరకు అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు , జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో వచ్చే దరఖాస్తుల్లో 100 లో 80 మంది భూ సమస్యలతో వస్తున్నారని వెల్లడించారు. సమావేశంలో రెవెన్యూ అధనపు కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీవో నవీన్, నియోజకవర్గం ప్రత్యేక అధికారి, జిల్లా సహకార అధికారి శంకరాచారి ,తహశీల్దార్లు రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.