ఖమ్మం, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనలేని దద్దమ్మ సర్కార్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. మక్కజొన్నకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 ఉంటే.. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయకపోవడంతో రైతులు రూ.1,600 కే దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఫలితంగా రైతులు క్వింటాల్‌కు రూ.800 చొప్పున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రైతులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేపట్టింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూద న్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో వద్దిరాజుతోపాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ లిం గాల కమల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ధర్నా చౌక్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ ప్రధాన గేట్లను నెట్టుకొని లోపలికి వెళ్లి కొద్దిసేపు బైఠాయించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మహా ధర్నానుద్దేశించి వద్దిరాజు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ అప్పటి సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, వరి, మక్కలను కొనుగోలు చేసి న విషయాన్ని గుర్తుచేశారు. రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేశారని తెలిపారు. అనుభవం ఉన్నట్టు చెప్పుకొనే మంత్రులు ఉత్తమకుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మంత్రి భట్టి విక్రమార్క.. ఉన్న ఈ జిల్లాలోని రైతులకు ఏ మాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని మండిపడ్డారు.
పదవుల కోసం పార్టీలు మారడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు 40 ఏండ్ల అనుభవం ఉన్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఎద్దేవా చేశారు. జిల్లాకు చెంది న ముగ్గురు మంత్రుల్లో ఒకరు కమీషన్ల కోసం, మరొకరు భూములను కబ్జా చేసేందు కు, ఇంకొకరు పర్సంటేజీల కోసం పనిచేస్తూ రాష్ర్టాన్ని ఆగం పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందారు.
బీఆర్ఎస్ ధర్నాతో జిల్లాలోని ముగ్గురు మంత్రుల గుండెల్లో గుబులు మొదలైందని ఎ మ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అధికారుల తోక కట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. రైతులు పండించిన పంట చేతికొచ్చి నెలరోజులైనా కొనుగోలు కేంద్రాలపై సమీక్ష నిర్వహించుకోవాలనే సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందని అన్నారు. రైతులు పండించిన పంటను కొనలేని దీనస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి మండిపడ్డారు.