హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): వానకాలం పంటల సాగు మొదలవడంతో రైతులంతా రైతుభరోసా పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు ఈసారైనా సమయానికి రైతుభరోసా ఇస్తుందో, లేదోననే అందోళన రైతుల్లో నెలకొన్నది. ఈ నేపథ్యంలో రైతులను మరోమారు మభ్యపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం వ్యవసాయ శాఖ నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో రైతుభరోసా పంపిణీపై సీఎం రేవంత్‌రెడ్డి ఒక తేదీని ప్రకటిస్తారని తెలిసింది. తద్వారా రైతులంతా ఆ గడువు తేదీ వరకు రైతు భరోసాపై నోరెత్తరని, దానిపై చర్చ కూడా ఆగిపోతుందని భావిస్తున్నది. ఈలోపు ఏదోలా నిధులు సేకరించి ఎంతోకొంత పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. నిజానికి ఈ నెల 16వ తేదీ నుంచే ప్రభుత్వం రైతు భరో సా సాయాన్ని పంపిణీ చేస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.
కత్తి మీద సాములా నిధుల సమీకరణ
రేవంత్‌రెడ్డి సర్కారు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. బయట రూపాయి కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. ఈ నేపథ్యంలో రైతు భరోసాకు నిధులు సమకూర్చడం కత్తిమీద సాములా మారింది. ఈ సీజన్లో సుమారు 70 లక్షల మంది రైతులకు సంబంధించిన 153 లక్షల ఎకరాలకు రైతుభరోసా సాయాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున సుమారు రూ. 9,200 కోట్ల నిధులు అవసరం అవుతాయి. దీనికి తోడు గత యాసంగికి సంబంధించి ఇంకా రూ. 4 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే మొత్తం రైతుభరోసా కోసం రూ. 13,200 కోట్లు అవసరం. ఇంత భారీ మొత్తం జమ చేయడం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ సీజన్‌కు అవసరమైన రూ. 9,200 కోట్లయినా సమకూర్చగలుగుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సర్పంచ్ ఎన్నికలే ఎజెండా
రైతుభరోసా వెనుక ప్రభుత్వం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఎజెండాను సెట్ చేసినట్టు తెలిసింది. ఈ నెలాఖరు నాటికి జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇదే నిజమైతే రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో పడిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కారు భావిస్తున్నది. లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదన్న భయం వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో 20వ తేదీ తర్వాత రైతుభరోసా పంపిణీని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఒకవేళ పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే రైతుభరోసా పంపిణీ తేదీ నిర్ణయం కూడా వాయిదా పడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.