Rythu Bharosa | హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): రైతుభరోసాలో కోతలు పెట్టడం ఖాయమైంది. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేస్తే, సాగుచేసిన భూములకే రైతుభరోసా నిధులు జమ చేయడం సులభం అవుతుందన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటలు నిజమవుతున్నాయి. మంత్రి ఆదేశాల మేరకు శాటిలైట్ సర్వే పూర్తి చేసిన వ్యవసాయ యూనివర్సిటీ రాష్ట్రంలో సాగులో లేని భూముల లెక్క తేల్చినట్టు తెలిసింది. సుమారు 10%-12% భూములు సాగులో లేవని నిర్ధారించినట్టు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ
విశ్వవిద్యాలయం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కోతలపై నిర్ణయం తీసుకోనున్నది. యాసంగి సీజన్‌కు సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతుభరోసా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
భారీగా నష్టపోనున్న రైతులు
రాష్ట్రంలో సాగుకు అనుకూలమైన భూమి 1.53 కోట్ల ఎకరాలు ఉన్నది. ఈ మొత్తం భూములకు గతంలో బీఆర్ఎస్ సర్కార్ రైతుబంధు నిధులు జమచేసింది. కాంగ్రెస్ సర్కార్ మాత్రం పంట సాగుచేసిన భూములకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన శాటిలైట్ సర్వే ప్రకారం మొత్తం 1.53 కోట్ల ఎకరాల భూమిలో 12% భూముల్లో, అంటే సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని తేల్చింది. దీంతో ఈ 20 లక్షల ఎకరాల భూములకు రైతుభరోసా కోత పెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యవసా య శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ వర్సిటీ ఇంకా పలు జిల్లాల్లో లెక్కలు తేల్చాల్సి ఉన్నట్టు సమాచారం. అంటే సాగులోని లేని భూమి ఇంకా పెరిగే అవకాశం ఉన్న ట్టు స్పష్టమవుతున్నది. ఈ లెక్కన సుమారు 25-30 లక్షల ఎకరాల భూమిని సాగులో లేనట్టుగా చూపి కోత పెట్టాలని భావిస్తున్నది. అంటే ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.3,600 కోట్లు కోత పెట్టబోతున్నది. ఆ మేరకు రైతులు నష్టపోనున్నారు.
గతంలో 2 లక్షలు.. ఇప్పుడు 20 లక్షలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొద లు.. రైతుబంధును అనర్హులకు, సాగులోలేని భూములకు ఇస్తున్నారంటూ ఆరోపణలు మొదలుపెట్టింది. నిరుడు కూడా సాగులో లేని భూములకు రైతుభరోసా ఇవ్వబోమని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సాగులో లేని భూముల లెక్క తేల్చింది. క్షేత్రస్థాయిలో ఏఈవోలతో రాష్ట్రవ్యాప్తంగా సాగులో లేని భూము ల వివరాలు తెప్పించింది. సుమారు 2 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భుములు కావని తేల్చింది. ఇప్పుడేమో శాటిలైట్ సర్వే పేరిట దీన్ని 20 లక్షలకుపైగా ఎకరాలకు పెంచడం విమర్శలకు తావిస్తున్నది.
కోతలే లక్ష్యంగా చర్యలు?
రైతుభరోసా విషయంలో సర్కార్ తీరు తొలి నుంచీ అనుమానంగానే ఉన్నది. ఆర్థిక భారాన్ని ఎలా తగ్గించుకోవాలనే ధ్యాస తప్ప, రైతుల మేలు కోసం ఆలోచన చేయడంలేదనే విమర్శలున్నాయి. అందుకే ఇప్పుడు శాటిలైట్ సర్వే పేరిట పంటలు వేయని భూములకు కోత పెట్టాలని చూస్తున్నది. ఎన్నికలకు ముందు ఎకరానికి రూ.15 వేల రైతుభరోసా ఇస్తామంటూ రైతులకు ఆశ పెట్టిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక రూ.12 వేలకే పరిమితం చేసింది. అంతేకాకుండా, ఒక సీజన్ రైతుభరోసా పూర్తిగా ఎగ్గొటింది. మరో రెండు సీజన్లలో సగం మందికే ఇచ్చింది. ఈ సీజన్ చెరిసగాన పడినా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు.