వేసిన పంటల అదును దాటిపోవడంతో యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. పనులన్నీ మానుకొని ఎరువుల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే అన్నదాతలు ఎరువుల కేంద్రాల వద్ద క్యూ కట్టారు. పలుచోట్ల యూరియా బస్తాలు తక్కువ రావడంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. సొసైటీల వద్ద రోజుల తరబడి వేచియున్నా యూరియా దొరకకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. వీరికి మద్దతుగా పలుచోట్ల బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్ను కర్షకులు చుట్టుముట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్యూలో నిలబడలేక పెండెల మల్లయ్య సొమ్మసిల్లి పడిపోయాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఎల్లయ్య యూరియా కోసం రోదిస్తూ బోర్లా పడుకుని నిరసన వ్యక్తంచేశాడు. నర్సింహులపేటలో మహిళా రైతును హెడ్ కానిస్టేబుల్ నెట్టేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీ వద్ద క్యూలో నిల్చొన్న ఆవుల నారాయణ ఫిట్స్ వచ్చి కిందపడిపోగా రైతులు స్థానిక దవాఖానకు తరలించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఐటీడీఏ భవనం వద్ద జరిగిన తోపులాటలో పలువురు రైతులు కిందపడ్డారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులతో మాట్లాడి కేసీఆర్ హయాంలో యూరియా కొరతలేని విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో యూరియా కొరతపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
ఒకవైపు అదును దాటుతుండటం, మరోవైపు యూరియా దొరకకపోవడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. మొన్నటివరకు ఓపిగ్గా బస్తా కోసం బారులు తీరిన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో యూరియా కోసం నిలబడి, క్యూలోనే సొమ్మసిల్లిన రైతు పెండెల మల్లయ్య
కడుపుమండిన రైతులు రోడ్డెక్కు తున్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా ఎరువుల కోసం రైతుల బారులే కనిపించాయి. యూరియా కూపన్ కోసం వేలమంది తరలివచ్చి లైన్కట్టడంతో మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఐటీడీఏ భవనం ప్రాంగణం ఇలా కిటకిటలాడింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు పీఏసీఎస్‌లో యూరియా కోసం భారీగా తరలివచ్చి క్యూలో నిల్చున్న రైతులు, మహిళా రైతులు
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం సింగిల్‌విండో కార్యాలయంలో రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులోని సొసైటీ కార్యాలయం వద్ద రైతులు పొద్దంతా బస్తాల కోసం పడిగాపులుపడ్డారు. అధికారులు కూపన్లు పంపిణీ చేసి.. యూరియా వచ్చినప్పుడు వచ్చి తీసుకెళ్లాలని సూచించారు.
కరీంనగర్ జిల్లా వీణవంకలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఐటీడీఏ భవనం వద్ద తోపులాటలో కిందపడిన రైతులు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం ముట్టడికి రైతులు యత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని రైతులను అడ్డుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిజాంపేట సొసైటీ వద్ద రైతులు వరుసలో చెప్పులు పెట్టి పక్కన సేదతీరారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌కు రైతులు తమ గోడును వివరించారు.
రైతుల పంటలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా రూరల్ మండలం నాయుడుపేట బైపాస్ రింగ్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్ను చుట్టుముట్టిన రైతులు
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గోపవరం సొసైటీ వద్ద పోలీసు పహారాలో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు.