Telangana | మొయినాబాద్/తూప్రాన్/ఆదిలాబాద్/రామారెడ్డి/కరీంనగర్, మే29: రాష్ట్రంలో విత్తన విపత్తు నెలకొన్నది. పచ్చిరొట్ట విత్తనాలనే పంపిణీ చేయలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. జనుము, జీలుగ, పచ్చి రొట్ట విత్తనాలు ఇవ్వలేని ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సరిపడా ఇస్తుందా ? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ శాఖ మే నెల మొదటి, రెండోవారంలోనే పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచాల్సింది. మే నెలాఖరు అయినప్పటికీ పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు పరుగులు తీయక తప్పడం లేదు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బుధవారం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద జనుము విత్తనాలు అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ విత్తనాల పంపిణీకి మొయినాబాద్ రైతువేదికలో, కేతిరెడ్డిపల్లి క్లస్టర్ కనకమామిడి రైతువేదికలో ఏఈవోలు టోకెన్లు ఇచ్చారు. టోకెన్ల కోసం ఉదయం 6గంటలకే రైతులు పరుగులు తీసి చెప్పులను లైన్లో పెట్టారు. టోకెన్లు తీసుకుని మళ్లీ పీఏసీఎస్ ఎదుట బారులు తీరారు.
మొయినాబాద్ మండలానికి 220 (40 కిలోల బస్తా) బస్తాలు మాత్రమే వచ్చాయి. ఒక పాస్ పుస్తకానికి ఒక బస్తా మాత్రమే ఇచ్చినా మరో 150 మంది ఉత్తచేతులతోనే ఇంటికి వెళ్లారు. ఉదయం నుంచి పడిగాపులుకాసినా బస్తా దొరకకపోవడంతో రైతులు అధికారులను నిలదీశారు. రెండు రోజుల్లో విత్తనాలు ఇస్తామని వ్యవసాయ అధికారి రాగమ్మ రైతులను సముదాయించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి వచ్చి రైతులకు సరిపడా విత్తనాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో జీలుగ విత్తనాల కోసం లైన్లో గంటల తరబడి నిలబడలేక రైతులు రోడ్డెక్కారు. తూప్రాన్‌లోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం ఎదురుగా రాస్తారోకో నిర్వహించి, సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో రైతులు పాస్‌బుక్ జిరాక్స్‌లను వరుసలో ఉంచారు.
మొత్తం 7వేల మందికిపైగా రైతులకు విత్తనాలు అందించాల్సి ఉండగా, 987 బస్తాల జీలుగు, 300 బస్తాల జనుము విత్తనాలు మాత్రమే పంపిణీ చేశారు. తెల్లవారుజామునే వచ్చి లైన్లో ఉన్నామని, పొద్దంతా ఎండలో పడిగాపులు కాసినా తమకు విత్తనాలు దొరకలేదని రైతులు వాపోయారు. కరీంనగర్ జిల్లాలో 7వేల క్వింటాళ్ల జీలుగ, 200క్వింటాళ్ల జనుము అవసరం ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారులు ఇండెంట్ ఇచ్చారు. ఇప్పటివరకు 2,500 క్వింటాళ్ల జీలుగ, 150 క్వింటాళ్ల జనుము విత్తనాలు మాత్రమే జిల్లాకు చేరుకున్నాయి. బుధవారం సుమారు 2,500క్వింటాళ్ల జీలుగ విత్తనాలను జిల్లాలోని 62 కేంద్రాల్లో పంపిణీ చేయగా, రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లిలో సుమారు 40 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను పంపిణీ చేయగా, రెండుమూడు గంటల్లోనే ఖాళీ అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రెండోరోజూ రైతులు దుకాణాల వద్ద బారులుదీరారు. ఒక్కో రైతుకు ఆర్సీహెచ్ 659 విత్తనాలను రెండు ప్యాకెట్లు మాత్రమే పంపిణీ చేశారు. మండుటెండలోనూ రైతులు భారీగా తరలిరావడంతో ఆదిలాబాద్ మార్కెట్ ఏరియా రద్దీగా మారింది. విత్తనాల అమ్మకాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం పర్యవేక్షించారు.
రైతులను ఇబ్బంది పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? వానకాలం సీజన్ ప్రారంభమైనా జీలుగు, జనుము, విత్తనాలు ఇంకెప్పుడు ఇస్తరు? అధికార యంత్రాంగం సాగుకు అవసరమైన అంచనా వేసి ఫర్టిలైజర్, ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయాలి. నకిలీ విత్తనాలతో అన్నదాతలు నష్టపోతున్నరు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– ఊరడి శివారెడ్డి, గోపాల్పూర్, కరీంనగర్