కందుకూరు, డిసెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం బేగరికంచె సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫోర్త్‌సిటీకి భూములివ్వబోమని రైతులు స్పష్టం చేశారు. కందుకూరు మండల పరిధిలోని రైతులు పలువురు ఆదివారం రాచులూరులో సమావేశమయ్యారు. ఫోర్త్‌సిటీ కోసం కొంగర నుంచి మండల పరిధిలోని అగర్మియగూడ, తిమ్మాపూరు, లేమూరు, రాచులూరు, గాజులబుర్జు తండా, తుర్కగూడ, గుమ్మడవెల్లి, ఆకులమైలారం, మీర్ఖాన్పేట్, గ్రామాల మీదుగా 330 ఫీట్ల రోడ్డు కారణంగా రైతులు భూములు కోల్పోవాల్సి వస్తున్నది. కాగా, ఈ భూములను ఇవ్వకూడదని రైతులు నిర్ణయించారు. భూమికి భూమి, మార్కెట్ రేటు కంటే అదనంగా 3 రేట్లు పరిహారం ఇవ్వాలని రైతు లు డిమాండ్ చేస్తున్నారు. కాగా రైతులతో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు. సమావేశం అనంతరం రైతులు అక్కడే వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. గ్రామాల రైతులు ద్యాసాని సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్, భూపాల్‌రెడ్డి, జంగారెడ్డి, శ్రీనివాస్‌చారి, జంగయ్య, యాదయ్య, రమేశ్ పాల్గొన్నారు.