కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, పోలీసులు గేట్లు మూసి లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో రైతులు-పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. గేటు ముందు బైఠాయించిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా కోవ లక్ష్మి, ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిలో తేమ శాతం పెరిగిందని అన్నారు. 8 నుంచి 12 శాతంలోపు తేమ ఉంటేనే పత్తి కొనుగోళ్లు చేపడుతామని సీసీఐ నిబంధనలు పెట్టడం సరికాదని, ఇది ముమ్మాటికీ దళారులు, ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకేనని మండిపడ్డారు. పత్తిలో తేమ శాతం 20 వరకు ఉన్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి అమ్మాలనుకునే రైతులను మరింత ఇబ్బంది పెట్టేందుకే కపాస్ కిసాన్ యాప్ అనే కొత్త నిబంధన తీసుకురావడంతో రైతులు పత్తి అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని, ఈ యాప్ వినియోగంపై రైతులకు ఏ మాత్రం అవగాహన లేదని అన్నారు.
పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ నుంచి జిన్నింగ్లో నియమించిన సిబ్బందిని కూడా ఆంధ్రా నుంచి తీసుకొచ్చారని, వారు రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పత్తి రైతు సమస్యలపై అధికారులు, మంత్రులు ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమని అన్నారు.
పత్తి అమ్ముకునేందుకు రైతులు వేలాది రూపాయలు వాహనాల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని, రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నదని ఆవేదన చెందారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వెంటనే రైతు భరోసా ఇవ్వడంతోపాటు రూ. 2 లక్షల కంటే ఎక్కువ పంటరుణాలు తీసుకున్న రైతులకు కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం సాగిస్తుందని హెచ్చరించారు.