దేవరుప్పుల, జూన్ 5 : రైతులు రెండు నెలలుగా కల్లాల వద్ద కన్నీరు పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోస్తే కొనే దిక్కు లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే దమ్ము ఏ ఒక్క మంత్రికైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా వస్తే రైతులు ఉరుకిచ్చి కొడుతరని హెచ్చరించారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. ‘ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి రెండు నెలలైంది.. జోకే దిక్కు లేదు.. కాలం నెత్తిమీదికొచ్చింది. రోహిణి కార్తె సగం గడిచింది.. దుక్కులు దున్నలే. పిల్లాపాపలతోని కుటుంబం మొత్తం ఇక్కడనే నీలుగుతున్నం, వానలు కురిస్తే వడ్లు మట్టిపాలవుతయ్’ అని పలువురు రైతులు ఎర్రబెల్లితో మొరపెట్టుకున్నారు.
అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఇంత చేతగాని ప్రభుత్వాన్ని తానెన్నడూ చూడలేదని విమర్శించారు. ఇది దద్దమ్మ ప్రభుత్వమని, దోచుకునుడు.. దాచుకునుడే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని మండిపడ్డారు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే సర్కార్‌కు చలనం లేదని ధ్వజమెత్తారు. ‘వ్యవసాయ పనులు వదిలి రోజుల తరబడి యూరియా కోసం దుకాణాల చుట్టూ తిరిగిండ్రు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నీలుగుతుండ్రు. ఇగ ఎప్పుడు వ్యవసాయం చేయాలె.. ఇవి రేవంత్‌రెడ్డికి కనిపించడంలేదా?’ అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ‘లారీలు రావు. పోతే దిగుమతి కావు. ఇదేం పద్ధతి. ప్రభుత్వానికి కనీస అవగాహన లేదు’ అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని, ధైర్యంగా ఉండాలని సూచించారు. సర్కార్ ఇకనైనా కండ్లు తెరిచి, చివరి గింజ వరకు ధాన్యం కొనాలని, తడిచినా, మొలకొచ్చినా కొనాలని డిమాండ్ చేశారు.