Nalgonda | చిట్యాల, మార్చి 16 : ఓవైపు నీళ్లు లేవు.. మరోవైపు లోవోల్టేజీ సమస్యతో పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించడానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం ఆ గ్రామంలో పర్యటించారు. ఎండిన వరి పొలాలను పరిశీలించి ఆ భూములకు సంబంధించిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పరిస్థితులను చిరుమర్తికి తమ సమస్యలను విన్నవించారు.
రైతు మంకాల బాలయ్య మాట్లాడుతూ.. నాలుగున్నర ఎకరాల్లో వరి పంట వేయగా నీళ్లు లేక రెండున్నర ఎకరాలు ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నాలుగు బోర్లు ఉంటే అందులో మూడు ఎండిపోయినట్టు తెలిపాడు. గతంలో ఎప్పుడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదన్నాడు. మిగిలిన పొలాన్నైన బతికించుకోవడానికి రోజూ ట్యాంకర్‌కు రూ.1,500 ఇచ్చి నీళ్లు పోయిస్తున్నట్టు తెలిపాడు. లోవోల్టేజీ సమస్య వల్ల నాలుగు సార్లు మోటర్లు కాలిపోయాయని, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక పోతున్నట్టు ఆవేదన చెందాడు.
మరో రైతు ఏనుగు మల్లారెడ్డి మాట్లాడుతూ.. పొట్టకొచ్చిన పంట ఎండిపోయిందని, చేసేదేమీ లేక జీవాలను మేపుతున్నట్టు తెలిపాడు. బోర్లలో నీళ్లు అడుగంటిపోయాయని, లోవోల్టేజీ సమస్యతో సతమతమవుతున్నట్టు చెప్పాడు. రెండెకరాల్లో వరి వేస్తే ఎకరంన్నర ఎండిపోయిందని, ఉన్న మూడు బోర్లలో నీళ్లు తగ్గినట్టు తెలిపాడు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి సమస్య రాలేదని అన్నాడు. కాంగ్రెస్ సర్కార్ మస్తు తిప్పలు పెడుతుందని ఆవేదన చెందాడు.
ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఏ పీలో ఉన్న విధంగా భూములు తిరిగి బీడుగా మారుతున్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. కాంగ్రెస్ అవగాహన రాహిత్యంతోనే చేతికొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. రైతులు ఎకరానికి దాదాపు రూ.35 వేల వర కు ఖర్చు చేస్తే నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పొలాలకు ఎకరాకు రూ.50 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు సంక్షేమాన్ని గాలికొదిలి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు.