హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నవేళ అక్కడి ఫార్మాసిటీ రైతులు షాక్ ఇచ్చారు. అసలు ఈ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. ఫార్మా సిటీకి కేటాయించిన భూముల్లో చట్టవిరుద్ధంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ ప్రకటనలు చేయడం, ఒప్పందాలు చేసుకోవడంపై మండిపడ్డారు. ఈ మేరకు సర్కారు తీరును వ్యతిరేకిస్తూ ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ప్రభుత్వం చేస్తున్న మోసమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ ఈ భూములను చూపించి ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలను నమ్మిస్తూ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించింది.
‘నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం ఈ భూములను సేకరించింది. ఆనాడు కొంతమంది రైతులు వ్యతిరేకించగా వారికి నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతు తెలిపింది. రేవంత్‌రెడ్డితోపాటు ప్రస్తుత మంత్రులు ఆ రైతుల వద్దకు వెళ్లి ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూములను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక రైతులకు భూములు తిరిగి ఇస్తామనే హామీని పక్కనపెట్టి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కొత్తగా ఫ్యూచర్‌సిటీ పేరుతో హంగామా చేస్తున్నారు. ఈ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది’ అని రైతులు తమ ప్రకటనలో విరుచుకుపడ్డారు. హైకోర్టుకు ఒకటి చెప్పి.. ఇప్పుడు మరొకటి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని హామీలిస్తూ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సర్కారు హైకోర్టులో మాత్రం ఫార్మాసిటీ కొనసాగిస్తున్నామని అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తుచేశారు. ఈ విధంగా ఎన్నికలకు ముందు తమ భూములు తిరిగి ఇస్తామని మాయ మాటలు చెప్పి ఇప్పుడు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూముల్లో ఫ్యూచర్‌సిటీ నిర్మించడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని రైతులు తేల్చిచెప్పారు. ఒకవేళ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మించాలనుకుంటే ఫార్మా సిటీ కోసం సేకరించిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తరువాత మళ్లీ ప్రతి గ్రామంలో కొత్త ప్రాజెక్టు రిపోర్టు పెట్టి ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుందని, కొత్తగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు యాచారం మండలంలోని నాలుగు గ్రామాలు మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్దలో రైతుల భూములు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ సర్కారు ఫ్యూచర్‌సిటీ పేరుతో చేస్తున్న భూ కేటాయింపులు, ఒప్పందాలను నమ్మి మోసపోవద్దని పారిశ్రామికవేత్తలకు అక్కడి రైతులు విజ్ఞప్తి చేశారు. చట్టపరంగా ఇక్కడ ఫ్యూచర్‌సిటీ నిర్మాణం సా ధ్యం కాదని స్పష్టంచేశారు. సర్కారు మాయమాటలు నమ్మి ఇక్కడ పెట్టుబడు లు పెడితే మోసపోతారని హెచ్చరించారు. ఫార్మా భూముల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామ ని, భూములు కేటాయిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ మోసపూరితమేనని తేల్చి చెప్పారు.