రైతు రగిలిపోయాడు. పల్లె రణరంగమైంది. ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వబోమంటున్నా.. ఒత్తిడి చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వం కనబడలేదు. కానీ కండ్లముందు అధికారులు కనిపించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ పల్లె ముందుకు మళ్లీ వచ్చిన సిబ్బంది కనిపించారు. అంతే! నాలుగు నెలలుగా సాగుతున్న నిరసనంతా ఆగ్రహంగా మారి, ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. కొడంగల్ పల్లెల్లో లోలోపల సలసలా మరుగుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది!
తమ ముందుకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు తొలుత నిరసన తెలిపారు లగచర్ల రైతులు. భూములివ్వబోమని, తమను ఇబ్బంది పెట్టొద్దని నినాదాలు చేస్తూ చుట్టుముట్టారు. ఆయనను బలవంతంగా తిప్పిపంపేశారు. భూ సేకరణకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మీద విరుచుకుపడ్డారు. తమ భూముల కోసం పదేపదే ఒత్తిడి చేస్తున్న కడా ప్రత్యేకాధికారిని చూడగానే వారిలో ఆగ్రహం పెల్లుబికింది. మూకుమ్మడిగా ఆయన మీద దాడికి దిగారు. మహిళలు, యువకులు రాళ్లు, కర్రలతో వెంటపడ్డారు. పొలాల వెంట పరిగెత్తించారు. పట్టుకుని చితకబాదారు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు.
ఇది ఫార్మాపై ఫార్మర్ రణం. లగచర్ల ఊరొక్కటే కాదు.. రోటిబండ తండా, పులిచర్లతండా, దుద్యాల, పోలేపల్లి, హకీంపేట.. ఒక్కో గ్రామం రగులుతున్న ఓ అగ్నిపర్వతం! ఆగ్రహపర్వతం! ఫార్మాసిటీకోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం సేకరించిన భూమి 12 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. వాటిని కాదని పల్లెల్లో ఫార్మాక్లస్టర్‌ల పేరిట భూములు గుంజుకోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్‌కు రైతుల అల్టిమేటం ఇది. హైడ్రా.. మూసీ.. ఇప్పుడు ఫార్మా.. ఏడాది పాలన పూర్తికాకముందే ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఇదో సంకేతం! ఇదో ప్రమాద హెచ్చరిక!
kodangal | మహబూబ్‌నగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కొడంగల్ : కాంగ్రెస్ సర్కార్ మొండిపట్టుతో సహనం నశించిన కర్షకులు కన్నెర్రజేశారు. తమ భూములు గుంజుకునే ప్రయత్నాలపై కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తిరగబడ్డారు. ఏకంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఇతర అధికారులపైకి దండెత్తి దొరికినోళ్లను దొరికినట్టు తరిమికొట్టారు. కడా స్పెషల్ ఆఫీసర్, పరిగి డీఎస్పీని చుట్టుముట్టి మరీ చితకబాదారు. కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని వెంబడించి కొట్టడంతో ఆయన పొలాల వెంట పరుగులు తీసి సొమ్మసిల్లిపోయారు. ప్రభుత్వ వాహనాలను రాళ్లతో ధ్వంసం చేసిన రైతులు, గిరిజనులు దాదాపు అరగంట పాటు అధికారులను పరుగులు తీయించారు. ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది. ప్రధానంగా పోలీసు బలగాలు మోహరించి ఉన్నా రైతులు కోపోద్రిక్తులై అధికారులను తరిమికొట్టడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ‘అభివృద్ధి వద్దు.. ఏమీ వద్దు! మా మానాన మమ్మల్ని వదిలేయండి! ఫార్మా కంపెనీలకు భూమిలిచ్చే ప్రసక్తే లేదు.. భూముల కోసం ఎంతకైనా తెగిస్తాం’ అం టూ సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలోని రైతులు కొన్ని నెలలుగా తెగేసి చెబుతున్నా సర్కారు మొండిపట్టు వీడలేదు. ప్రజాభిప్రాయ సేకరణ.. గ్రామసభ.. అంటూ రైతుల భూముల సేకరణకు చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు బలయ్యారు. ఏకంగా కలెక్టర్ సహా అధికారయంత్రాంగంపై దాడి చేసే పరిస్థితి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ముందుగా రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్పై దాడికి ప్రయత్నించి.. వారి వాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిని చుట్టుముట్టి కొట్టారు. వెంకట్‌రెడ్డిని వెంబడించి కొట్టడంతో ఆయన పొలాల వెంట పరుగులు తీశారు. ఈ ఘటనతో లగచర్ల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు గాను దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్ల కుంట తండాల పరిధిలో 1,375 ఎకరాలు సేకరించాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో 600 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. మిగిలిన 775 ఎకరాల వరకు రైతుల వద్ద సేకరించాల్సి ఉండగా తమ భూములు ఇచ్చేదిలేదని బాధిత రైతులు నెలల తరబడి దీక్షలు చేస్తూ, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ సహా అధికారులందరికీ వినతిపత్రాలు కూడా సమర్పించారు. అయినా భూసేకరణ కోసం ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత నెల 25న కూడా లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమావేశానికి హైదరాబాద్ నుంచి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు, దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ వాహనాన్ని రోటిబండతండా వద్ద అడ్డుకున్న తండావాసులు అతడిని వాహనం నుంచి దింపి మరీ దాడి చేశారు. ఉరికించి కొట్టడంతో పోలీసులు ఆయనను గదిలో వేసి రక్షణ కల్పించినా తండావాసులు తిరిగి దాడికి తీవ్రస్థాయిలో యత్నించారు. ఈ సంఘటన తర్వాత కూడా రైతులు పలువురు అధికారులను కలిసి ఫార్మా కంపెనీ ఏర్పాటుకు తాము భూములు ఇవ్వబోమని, తమను వదిలేయాలంటూ వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ప్రభుత్వం ఒత్తిడి మేరకు అధికారులు మళ్లీ భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సోమవారం దుద్యాల మండలం దుద్యాల-హకీంపేట గ్రామాల మధ్య గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం లగచర్లకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
గ్రామసభకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్‌ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, కొడంగల్ తహసీల్దార్ విజయ్‌కుమార్‌తో పలువురు అధికారులు వికారాబాద్ నుంచి సభ ప్రదేశానికి సుమారు 11.30 గంటలకు చేరుకున్నారు. గత సంఘటనను దృష్టిలో పెట్టుకొని పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు కల్పించారు. కలెక్టర్, అధికారులు అక్కడికి వచ్చేసరికి రైతులెవరూ రాలేదు. వారు ఎందుకు రాలేదని కలెక్టర్ వాకబు చేశారు. ఈ క్రమంలో లగచర్ల నుంచి వచ్చిన ఒక రైతు కలెక్టర్‌తో మాట్లాడాడు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై సమావేశం ఉంటుందని తమ గ్రామంలో ఆదివారం రాత్రి డప్పు వాయించారని, కానీ గ్రామసభ, ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని, కలెక్టర్, ఇతర అధికారులు వస్తారనే సమాచారం మాత్రం తమకు ఇవ్వలేదని చెప్పాడు. రైతులంతా లగచర్లలో ఉన్నారని, వందల మంది రైతులు ఇక్కడికి వచ్చే బదులు పది మంది అధికారులు అక్కడికే వస్తే బాగుంటుందని సదరు రైతు కలెక్టర్‌ను కోరాడు. ఇక్కడైతే సభ, ఏర్పాట్లు ఉన్నాయని.. అక్కడ సౌకర్యాలు ఉండవని కలెక్టర్ చెప్పినా కుర్చీలు ఉంటాయని రైతు సమాధానం చెప్పడంతో చివరకు అక్కడికి వెళ్లేందుకు కలెక్టర్ అంగీకరించారు. ఇతర అధికారులతో కలిసి సుమారు 12 గంటల ప్రాంతంలో లగచర్లకు బయలుదేరారు.
లగచర్లలో టెంటు వేసుకొని నిరసన తెలుపుతున్న రైతుల దగ్గరికి కలెక్టర్, ఇతర అధికారులు సుమారు 12.30 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ముందుగా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్ వాహనం దిగి రైతుల వద్దకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా రైతులు ‘కలెక్టర్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకొచ్చారు. కలెక్టర్ వారిని సమాధానపరిచేందుకు ప్రయత్నించినా వారు ఏమాత్రం వినిపించుకోలేదు. ఈలోగా తేరుకున్న కలెక్టరేట్ సిబ్బంది, ఇతర అధికారులు కలెక్టర్ చుట్టూ చేరి ఆయన దగ్గరికి రైతులు రాకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే గుంపుగా వచ్చిన మహిళలతో సహా రైతులు కలెక్టర్ ఉన్న వైపు రావడం.. తోపులాట చోటుచేసుకోవడంతో ఆయన వెనక్కి వెళ్లారు. ఈలోగా ఓ మహిళా రైతు కలెక్టర్‌పై చేయి చేసుకోవడంతో పరిస్థితిని గుర్తించిన ఆయన వెంటనే తన వాహనం వైపువెళ్లారు. అప్పటికే చుట్టుముట్టిన రైతులు ఆయనను నిలువరించే ప్రయత్నం చేశారు. అదనపు కలెక్టర్ లింగానాయక్ను ఓ రైతు గొంతు పట్టి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అక్కడ పెద్ద ఎత్తున గలాటా జరుగుతుండటంతో కలెక్టర్ తన వాహనం వద్దకు చేరుకొని, లోపల కూర్చున్నారు. అయినప్పటికీ రైతులు వాహనాన్ని చుట్టుముట్టి రాళ్లు, కర్రలతో వాహనంపై దాడి చేశారు. వాహనం వెనక అద్దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. కలెక్టర్ కూర్చున్న తర్వాత కూడా రాళ్లతో ముందటి అద్దాన్ని ధ్వంసం చేశారు. దీంతో డ్రైవర్ వేగంగా వాహనాన్ని ముందుకుపోనిచ్చి వికారాబాద్ వెళ్లిపోయారు.
ఫార్మా కంపెనీకి తమ భూములు ఇచ్చేందుకు గిరిజనులు ఏ మాత్రం అంగీకరించడం లేదు. ‘భూములు ఇవ్వకుంటే గుంజుకుంటాం’ అంటూ కడా అధికారి చేసిన హెచ్చరికలే గిరిజనులను ఏకం చేసినట్టు తెలుస్తున్నది. వారు తమ ప్రాణం పోయినా భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. వారం కిందట ఓ కాంగ్రెస్ నేతను కారులోంచి దింపి మరీ కొట్టిన సంగతి తెలిసిందే..
ఫార్మాసిటీ కోసం కేసీఆర్ హయాంలో సుమారు 14 వేల ఎకరాలు గుర్తించారు. కాంగ్రెస్ రాగానే ఫార్మాసిటీ ఏర్పాట్లను రద్దుచేసి సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు దుద్యాల మండలాన్ని ఎంచుకున్నారు. మూడు వేల ఎకరాలు సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో ఇక తమ బతుకులు బాగుపడతాయనుకున్న స్థానిక రైతులు, గిరిజనులకు ఇది మింగుడుపడలేదు. దుద్యాల మండలంలోని ఆరు గ్రామాల్లో ఉన్న రైతులంతా గిరిజనులే (లంబాడాలు) కాగా, సేద్యం చేసుకొని బతికే వీరికి ఫార్మాసిటీ శాపంగా మారింది. ఈ గ్రామాల పరిధిలో ఎకరాకు రూ.60 లక్షల దాకా ధర పలుకుతున్నది. కానీ ప్రభుత్వం మాత్రం రూ.10 లక్షలు ఇస్తాం.. ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నది. భూములన్నీ పోగొట్టుకొని చిన్నాచితకా ఉద్యోగాల కోసం వెంపర్లాడడం అవసరమా? అంటూ గిరిజనులంతా ఏకమయ్యారు. పచ్చని పల్లెల్లో కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు పెట్టొద్దంటూ ఆందోళనలు చేపడుతున్నారు. అన్ని గ్రామాలకు సమీపంలో టెంట్ వేసి మరీ నిరాహార దీక్షలకు దిగారు.
ఆయా గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అభ్యంతరం లేదని బొంరాస్‌పేట కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్, నరసింహ, సింగర్ నర్సింహతోపాటు మరోఇద్దరు తీర్మానాలు చేసి పంపగా అప్పట్లోనే వీరిపై గిరిజనులు తిరగబడ్డారు. తమను అడగకుండానే పంపిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి ఫార్మా కంపెనీకి అడుగులు పడుతున్నాయని తెలిసి ఏకమై తిరుగుబాటు జెండా ఎగరేశారు. దీనికి ప్రధాన కారకుడైన శేఖర్‌పై దాడి చేందుకు ప్రయత్నించగా గ్రామపంచాయతీలో దాక్కున్నారు. తాజాగా నచ్చజెప్పిందుకు ప్రయత్నించిన కలెక్టర్‌పై గిరిజనులు దాడి చేసినంత పనిచేశారు. గతంలో భూములు ఇవ్వకుంటే లాక్కుంటామని బెదిరించిన కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డిని ఉరికించి కొట్టారు. ఈ ఘటన తర్వాత లగచర్ల పూర్తిగా నిర్మానుష్యమైంది. గ్రామంలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతున్నది. ఇండ్లల్లోంచి ఎవరూ బయటికి రావడం లేదు. చుట్టుపక్కల గ్రామాలన్నీ భయంతో గజగజ వణుకుతున్నాయి.
ఫార్మా కంపెనీ ఏర్పాటును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా పదేపదే ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామసభ అంటూ అధికారులు విసిగిస్తున్నారని ఫార్మా బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తాము భూములు ఇచ్చేది లేదని చెప్పినా ప్రభుత్వం మొండి వైఖరి వీడటంలేదని చెప్పారు. ఎనిమిది నెలలుగా రోజూ ఇదే వరుస కొనసాగుతున్నదని, భూములను కాపాడుకునేందుకు తిండి, నిద్ర లేకుండా గడుపుతున్నామని వాపోయారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకో లేదని తెలిపారు. గత నెలలోనే రోటిబండ తండాలో పెద్ద ఎత్తున రగడ కొనసాగిందని, కొన్ని రోజులు సద్దుమణిగాక ఇప్పుడు సమావేశం అంటూ మళ్లీ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. అందుకే తాము విగిసిపోయి అధికారులపై తిరుగబాటు చేయాల్సి వచ్చిందని పలువురు రైతులు చెప్పారు. కోట్లాది రూపాయల విలువైన భూములను ప్రభుత్వానికి అప్పజెప్పి తాము, తమ పిల్లలు ఎలా బతకాలని, తమ జీవనాధారం పోతే ఏం చేసుకొని జీవించాలని ప్రశ్నించారు.
వాహనంలో కలెక్టర్ వెళ్లిపోయిన తర్వాత కూడా లగచర్ల రణరంగాన్ని తలపించింది. పెద్ద సంఖ్యలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు, ఇతర అధికారులపై దాడికి దిగారు. ముఖ్యంగా కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డితో పాటు డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిపైనా దాడి చేశారు. కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని చుట్టుముట్టి తీవ్రస్థాయిలో పిడిగుద్దులు గుద్దడంతో ఆయన భయంతో పరుగులు తీశారు. అయినా వెనక్కితగ్గకుండా వెంబడించి మరీ కొట్టారు. ఈ క్రమంలో వెంకట్‌రెడ్డి అంగీ చినిగిపోయింది. భయంతో ఆయన పొలాల్లో పరుగులు తీశారు. రైతులు వెంటపడటంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రైతులను చెదరగొట్టారు. అనంతరం తమ రక్షణ మధ్య పోలీసులు వెంకట్‌రెడ్డిని అక్కడికి నుంచి వాహనంలో తరలించారు. మరోవైపు ఇతర రైతులు కూడా పలువురు అధికారుల వెంటపడటంతో వారు భయంతో పోలీసు వాహనాలు ఎక్కి తమనుతాము కాపాడుకున్నారు. ఇలా దాదాపు అర గంట పాటు లగచర్ల రణరంగాన్ని తలపించింది.