న్యూస్‌నెట్‌వర్క్, అక్టోబర్ 19: రైతుభరోసా ఇప్పుడు ఇవ్వలేమన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యాఖ్యలపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. ఎన్నికల ముం దు రైతులకు పంటల పెట్టుబడి కోసం ఇచ్చిన రైతు భరోసా హామీని ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బస్టాండ్ సమీపంలో.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశా రు. సీఐ సైదా దిష్టిబొమ్మను లాక్కెళ్లే ప్రయ త్నం చేయగా.. బీఆర్ఎస్ శ్రేణులు ఆయనను అడ్డుకొని దిష్టిబొమ్మను దహనం చేశాయి. నల్లగొండ జిల్లా కట్టంగూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు లు ధర్నా నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి, గద్వాల, భూత్పూరు, మూసాపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, బాల్కొండ, ఏర్గట్ల, కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్‌గల్, ఆర్మూర్ మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు సీఎం రేవంత్, మంత్రి తుమ్మల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సూర్యాపేటలోని జనగాం క్రాస్ రోడ్డులో జాతీయ రహదారిపై సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.