Telangana | నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్ : కాంగ్రెస్ లీలలు ఇంతంత కావయా! అనేది ఇందుకే. ఆ పార్టీలో ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడతారో వారికే తెలియదు. అధికారమే పరమావధిగా హామీలు గుప్పిస్తున్న కాంగ్రెస్ దాని పర్యవసానాలను మాత్రం పక్కన పెట్టేసింది. మూడు గంటల కరెంటిస్తామని ఒకసారి, రైతుబంధు రద్దు చేసి భూమాత పోర్టల్ తెస్తామని ఇంకోసారి, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోమని ఇంకోసారి, పహాణీల్లో కౌలుదారుల కాలం తెస్తామని.. ఇలా వరుస ప్రకటనలు చేస్తూ అన్నదాతలను గందరగోళ పరుస్తున్నది. మూడు గంటల కరెంటుతో భూములు పడావుగా మారుతాయని, కౌలుదారుల కాలంతో గ్రామాల్లో గొడవలు నిత్యకృత్యమవుతాయని ఏమాత్రం సోయిలేని కాంగ్రెస్‌ను తమ దరిదాపుల్లోకి కూడా రాకుండా తరిమికొడతామని రైతన్నలు ప్రతిజ్ఞ చేస్తున్నారు.
3 హెచ్‌పీకి కరెంటు ఇయ్యనోళ్లు.. 10 హెచ్‌పీకి ఇస్తరా?
కాంగ్రెస్ పాలనలో మూడు గంటల కరెంటు కోసం బావులు వద్ద పడిగాపులు కాసేవాళ్లం. నీళ్లు అందక పంటలు ఎండిపోయేవి. చిన్న రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు పంటలకు నీళ్లు పెడుతున్నాం.
రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతదని, 10 హెచ్‌పీ మోటర్లు వాడమని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 3 హెచ్‌పీ మోటర్లకు కరెంటు ఇయ్యనోళ్లు ఇప్పడు 10 హెచ్‌పీ మోటర్లకు కరెంటు ఇస్తామంటే ఎవరు నమ్ముతారు. 63 కేవీ ట్రాన్స్ఫార్మర్లతో 3 హెచ్‌పీ మోటర్లు 12 నడుస్తాయి. 10 హెచ్పీతో మూడు మోటర్లు నడిచే పరిస్థితి ఉండదు. టాన్స్ఫార్మర్లపై లోడ్ పడి కాలిపోతాయి. రేవంత్‌రెడ్డికి 10 హెచ్‌పీ ఆలోచన రావడం దురదృష్టకరం.
– గంగన్న, రైతు, కజ్జర్ల, తలమడుగు మండలం, ఆదిలాబాద్ జిల్లా
నోటిమాటతోనే కౌలుకిస్తాం
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో రైతుల భూములకు పూర్తిస్థాయిలో రక్షణ కలిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెప్పడం తెలివి తక్కువ ఆలోచన. ధరణి లేకపోతే మళ్లీ దళారుల రాజ్యం వచ్చి అన్నదాతలు ఆగమవుతారు. కాంగ్రెస్ పార్టీ కౌలు రైతుల కోసం నూతన చట్టాన్ని తెస్తామని చెబుతున్నది. అదే జరిగితే భూ యజమానులు, కౌలురైతుల మధ్య వివాదాలు జరుగుతాయి.
గతంలో ఎప్పుడూ కౌలు రైతులతో ఒప్పంద పత్రం రాసుకోలేదు. నోటి మాటతోనే కౌలుకి ఇచ్చేవాళ్లం. రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పట్టాదారుడికి లేదంటే కౌలురైతుల్లో ఒకరికే ఇస్తామంటున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతులు అప్పులపాలు కావడం ఖాయం. పట్టాదారులు తమ భూములను ఖాళీగా ఉంచుకుంటారే తప్ప కౌలుకి ఇవ్వరు. అప్పుడు భూములన్నీ పడావుగా పడి ఉంటాయి. 24 గంటల కరెంట్‌తో రైతులు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ఇస్తామంటున్న 3 గంటల కరెంట్‌తో పంటల విస్తీర్ణం తగ్గిపోతుంది.
-రవీందర్‌రెడ్డి, సాలార్‌పూర్ సర్పంచ్, కడ్తాల్ మండలం
భూమి హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తది
ధరణి పోర్టల్‌ను తీసివేస్తే రైతుకు తీరని నష్టం కలుగుతుంది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పాస్‌బుక్‌లు ఇవ్వకపోవడం వల్లనే ఏండ్లుగా భూమిపై హక్కులు పొందలేదు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించారు.
ఎప్పుడు పడితే అప్పుడు భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇది రైతుకు ప్రయోజనకరంగా ఉంది. ఈ పోర్టల్‌ను తీసివేసి దీనిస్థానంలో భూమాత పోర్టల్‌ను పెట్టడం రైతులకు ఇబ్బందికరం. ఈ పోర్టల్‌లో కౌలు రైతులను అనుభవదారు కాలంలో పొందుపరుస్తామని చెబుతున్నారు. దీనివల్ల భూమి ఉన్న రైతుకు భూమిహక్కులు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతాంగానికి నష్టం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి ప్రభుత్వాన్ని గెలిపిస్తాం.
– గుడిపూడి శ్రీనివాసరావు, రైతు, గార్లపాడు, బోనకల్లు మండలం, ఖమ్మం జిల్లా
మూడు గంటల కరెంట్‌తో సాగు ఎలా?
మూడు గంటల కరెంట్ ఇస్తే వ్యవసాయం సాగు చేసేది ఎలా? పంటల సాగుకు నీళ్లు సరిపోక సాగు విస్తీర్ణం తగ్గుతుంది. తెలంగాణ రాక ముందు ఉండే పరిస్థితిని రైతులు మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తుంది.
పంటలు బాగా పండి వ్యవసాయం అభివృద్ధి చెంది, భూముల ధరలు బాగా పెరిగాయి. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయ రంగంపై చేస్తున్న ప్రకటనలతో సాగు విస్తీర్ణం తగ్గి భూముల ధరలు పడిపోయే ప్రమాదం ఉన్నది. ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూములకు పూర్తి భద్రత ఏర్పడింది. ధరణి ఎత్తేసి రైతుల భూములకు భద్రత లేకుండా చేస్తారా? కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
-గండి అంజయ్య గౌడ్, రైతు సమన్వయ సమితి డైరెక్టర్, రాంపల్లి
కౌలు రైతుల కాలంతో కయ్యాలే
కాంగ్రెస్ పార్టీని నమ్మితే కష్టాల పాలుకావడం ఖాయం. అప్పట్లో కరెంటు ఎప్పుడొస్తుందోనని రాత్రీపగలు పొలం దగ్గరే పడిగాపులు కాసేటోళ్లం. అప్పట్లో వాళ్లు చేసిన ఘనకార్యం చాలదన్నట్టు ఇప్పుడు మళ్లీ దాపురించి మూడు గంటల కరెంటు సరిపోతుందంటే కర్షకులకు ఒళ్లు మండకుండా ఎలా ఉంటుంది?
పెద్ద మోటర్లు పెట్టుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తుండడం మాలాంటి రైతులకు మరింత కోపాన్ని తెప్పిస్తున్నది. పైగా భూముల రికార్డుల్లో కౌలురైతుల కాలం పెట్టాలంటున్నారు. అలా పెడితే గ్రామాల్లో భూముల యజమానులకు, కౌలు రైతులకు పంచాయితీలు పెరుగుతాయి. కౌలు రైతులకు, భూముల యజమానులకు మధ్య ఈ కాంగ్రెస్ నాయకులు ఘర్షణలు సృష్టించేలా ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే రైతులు రాజులయ్యారు. 24 గంటల కరెంటుతో పంటలను మంచిగా సాగుచేసుకుంటున్నారు. దిగుబడులు బాగా వస్తున్నాయి. అంతా మంచిగా ఉన్న ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు వచ్చి దీనినంతటినీ చెదరగొట్టేలా ఉన్నారు. కాంగ్రెస్ నేతల కుట్రలు పోవాలంటే రైతులంతా రైతుబాంధవుడైన కేసీఆర్ వెంటే ఉండాలి.
– చేతుల పెద్దవీర్రాజు, రైతు, మోరంపల్లిబంజర్, బూర్గంపహాడ్ మండలం, భద్రాద్రి జిల్లా
రైతులకు కాంగ్రెస్ ఏమీ ఇయ్యలే
రైతులకు కాంగ్రెస్ ఎప్పుడూ, ఏమీ ఇయ్యలే. ఎవుసం సక్కగ నడవాలంటే కరెంట్ ఎప్పుడు అస్తదో తెల్వాలె. మూడు గంటల కరెంట్ ఎట్ల సరిపోతది? 10 హెచ్‌పీ మోటర్ పెడితే బాయిల నీళ్లు ఉండయ్. కాంగ్రెసోళ్లకు రైతుల బాధలు తెల్వవు. రాసులకొద్దీ వడ్లు కేంద్రంల పోస్తున్నం. టైంకు కాంటా పెట్టి కొంటున్నర్రు.
కాంగ్రెస్ కంటే కేసీఆర్ చాలా నయం. కరెంట్ గిప్పుడే మంచిగస్తాంది. కాంగ్రెస్ ఏమిచ్చింది సారూ? ఏం ఇయ్యాలె. పొద్దుగాల నుంచి పొద్దు పోయేదాకా బాయికాడ ఉండేటోళ్లం. రాత్రి ఎప్పుడో కరెంట్ వచ్చేది. 24 గంటలు కరెంట్ ఉంటేనే రైతు బాగుపడేది. ఎకరం, రెండెకరాల పొలం పారాలంటే 6 గంటలు పడుతుంది. కేసీఆర్ సార్ మల్లా సీఎం అయితేనే అన్నీ సక్కగ ఉంటాయ్.
– తుమ్మల యాదగిరి, రైతు, పెద్దకోడూర్, సిద్దిపేట జిల్లా
ధరణి ఎత్తేసి రైతులను వీధిన పడేస్తరా?
అభివృద్ధి చెందుతున్న వ్యవసాయాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు ఉన్నాయి. రైతుల భూములకు భద్రత కల్పించిన ధరణిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఆన్లైన్లో భూములు కనిపిస్తుండడంతో కార్యాలయాల చుట్టూ తిరగకుండానే అన్ని పథకాలు అందుతున్నాయి.రైతులకు మేలు చేసే ధరణి ఎత్తివేసి రైతులను వీధిన పడేస్తారా? 3 గంటల కరెంట్‌తో వ్యవసాయం చేయడం సాధ్యమయ్యేపనేనా. 24 గంటల కరెంట్ ఇచ్చి సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తే కాంగ్రెస్ నాయకులు మాత్రం వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. రైతులు వ్యవసాయం చేయకుండా కాంగ్రెస్ అడ్డుకునేలా ప్రవర్తిస్తున్నది.
– బందెల పరమేశ్, రాంపల్లి
కౌలుదారు కాలంతో సాగు కష్టాలు
గతంలో అస్తవ్యస్తంగా ఉన్న భూముల రికార్డులను తెలంగాణ ప్రభుత్వం సరిచేసి ధరణి పోర్టల్‌లో పెట్టింది. రైతుల భూములకు రక్షణ ఏర్పడింది. భూముల విషయంలో అధికారుల నుంచి రైతుల చేతుల్లోకి అధికారం వచ్చింది.
రైతుల వేలిముద్ర లేకుండా భూముల బదలాయింపు జరగదు. ఇంత మంచి పద్ధతిని కాంగ్రెస్ నాయకులు మారుస్తామంటున్నారు. ఎన్నికల్లో లేనిపోని హామీలు ఇస్తూ రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారు. ధరణి పోర్టల్‌ను తీసివేస్తామని, పహాణీల్లో కౌలుదారుల వివరాలు పెడతామని అంటున్నారు. ధరణి తీసేస్తే రైతుల భూములు ఆగమవుతాయి. కౌలుదారు కాలంలో పెట్టడం వల్ల రైతులకు భూములపై అధికారం కోల్పోతామని భయం పట్టుకుంది.
– బండారి ప్రభాకర్, కజ్జర్ల, తలమడుగు మండలం, ఆదిలాబాద్ జిల్లా
కేసీఆర్ రైతు బాంధవుడు
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. రైతుల కష్టాలు తెలిసినోడు. అందుకే రైతులకు అవసరమైన సాగునీరు, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారు. కాంగ్రెస్‌కు రాష్ర్టాన్ని కట్టబెడితే ఇవన్నీ పోయి మళ్లీ పాతరోజులు వస్తాయి. ఆ పార్టీ నేతలు చెబుతున్నట్టుగా కౌలు చట్టం తెస్తే భూ సమస్యలు ఎక్కువవుతాయి. ధరణిని రద్దు చేస్తే పట్వారీ వ్యవస్థ వచ్చి మళ్లీ లంచాల బెడద తెరపైకి వస్తుంది.
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని అంటున్నరు. 24 గంటల కరెంటు ఉండబట్టే రైతు తనకు అనుకూలమైన సమయంలో పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నాడు. కాంగ్రెస్ వస్తే అర్ధరాత్రి కరెంటు ఇస్తుంది. రైతులు మళ్లీ రాత్రి, పగలు తేడా లేకుండా బావుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుంది. భూయజమానులు, కౌలురైతులు ఎవరికో ఒక్కరికే రైతుబంధు ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. దీంతో రైతులు మళ్లీ అప్పులకోసం తిప్పలు పడాల్సి వస్తుంది. ఇటు అరకొర కరెంట్‌తో పంటలు పండక.. అటు అప్పులు తీర్చే మార్గం లేక రైతుల బతుకులు అతలాకుతులామవుతాయి. మళ్లీ అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్సే గెలవాలి.
-బ్యాగరి బాలప్ప, బొంరాస్‌పేట