Rythu Bandhu | హైదరాబాద్/కరీంనగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ అయోమయంగా మారిం ది. ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు నిధులు చెల్లించారో, ఎంతమంది రైతుల ఖాతాల్లో జమ చేశారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటివరకు రెండెకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు జమైనట్టు తెలిసింది. ఇందులో కూడా ఎకరం భూమి గల కొందరు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు.
ఈ యాసంగిలో 69 లక్షల మంది రైతులకు రూ.7,600 కోట్ల పెట్టుబడి సాయం పంపిణీ చేయాల్సి ఉన్న ది. ప్రభుత్వం ఇప్పటివరకు 35 లక్షల మంది రైతులకు సుమారు రూ.2 వేల కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్టు తెలిసింది. ఈ లెక్కన ఇంకా దాదాపు 34 లక్షల మంది రైతులు యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఇంకా సుమారు రూ.5,600 కోట్లు పం పిణీ చేయాల్సి ఉన్నది. ఇప్పటికే యాసంగి సాగు తుది దశకు చేరుకుంటున్నది. అయినప్పటికీ, రైతుబంధు సాయం అందకపోవడంతో రైతులు పెట్టుబడికి డబ్బులు దొరక్క ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబంధు నిధుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
కరీంనగర్లో 37.31% భూమికే రైతుబంధు
నాట్లు వేసుకొని పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తుండగా.. మంత్రులు మా త్రం ఇష్టానుసారం నోరుపారేసుకుంటున్నారు. ‘రైతు బంధు రాలేదన్నోళ్లను చెప్పుతో కొట్టండి’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలు రైతుల్లో మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో రైతుబంధుపై ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పరిశీలన చేయగా ఆసక్తికర విషయా లు వెలుగుచూశాయి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా లో 7,11,575 మందికి పెట్టుబడి సాయం కింద రూ.642.86 కోట్లు అందించాలి. కానీ, ఈ నెల 22వ తేదీ వరకు 4,68,656 మందికి రూ.239.91 కోట్ల సాయాన్ని అందించారు. ఇంకా 2,42,919 మందికి రూ.402.96 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది. రైతుల సంఖ్య పరంగా మొత్తం రైతుల్లో 65.86% మందికి ఇచ్చినట్టుగా కనిపిస్తున్నప్పటికీ, విస్తీర్ణపరంగా చూస్తే 37.31 శాతానికే అందింది. ఇంకా సాగుచేసిన 62.68% భూ ములకు పెట్టుబడి సాయం అందాల్సి ఉన్నది. వాస్తవాలు ఇలా ఉంటే రైతులపై మంత్రులు నోరుపారేసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు కౌలురైతులకు పెట్టుబడి సాయం ఊసే లేదు.
నాటేసి పదిహేను దినాలైనా పైసలు రాలే
నాకు 1.20 ఎకరాల భూమి ఉన్నది. నాటేసి 15 దినాలైనా రైతుబంధు రాలేదు. నేను చిన్న రైతును. ఇప్పుడు పొలానికి ఎరువులు, మందులు కొనాలంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా. దుకాణం సేటు ఉద్దెర ఇస్తలేడు. సొసైటీలో గూడా పైసలు ఇస్తేనే మందుబస్తా ఇస్తున్రు. కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి పెట్టుబడి సాయం ఇవ్వడం వల్ల ఎవ్వనికి చేయి చాపకుండా నాట్లేసినం. ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నది.
– బైర కొమురయ్య, పెగడపల్లి, జగిత్యాల జిల్లా
రైతుబంధు పైసలు కోసం ఎదురు జూత్తున్న
నాకు మా మల్లాపూర్ పొలిమేరల నాలుగెకరాల జాగ ఉన్నది. కేసీఆర్ సర్కారు ఏటా రూ.40 వేల రైతుబంధు ఇచ్చింది. కలుపు, కైకిళ్లు, మందులు తెచ్చుకునేవాన్ని. రేవంత్‌రెడ్డి వచ్చినంక రెండు ఎకరాలు ఉన్న రైతులకే రైతుబంధు వేసిండ్రు అంటున్రు. మందులు తేవడానికి పైసల్లేక ఇబ్బంది పడుతున్నా.
– ముష్కరి శంకర్, మల్లాపూర్, జగిత్యాల జిల్లా
మూడు ఎకరాలకు ఇంకా రాలేదు
నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది. కొంత నువ్వు, ఆవ, వేసిన. మరికొంత పొలం సాగు చేస్తున్నా. కేసీఆర్ సర్కారు ఏటా రెండుసార్లు రూ.15 వేల చొప్పున రూ.30 వేలు నా ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు నాట్లు వేసి పది రోజులైంది. నా ఖాతాలో రైతుబంధు పైసలు పడలేదు. అదికారులను అడిగితే ఎప్పుడొస్తయో చెప్పడం లేదు.
– క్యాతం సురేశ్‌రెడ్డి, మల్లాపూర్, జగిత్యాల జిల్లా
ఇంతకాలం పెట్టుబడి సాయం తిప్పలు లేవు
నాకు 3 ఎకరాల భూమి ఉన్నది. వరి నాటేసి 20 రోజులైంది. ఇప్పటి వరకు రైతుబంధు పడలేదు. రేపు మాపు అంటున్నారే తప్ప ఇవ్వడం లేదు. కేసీఆర్ సమయానికి రైతుబంధు ఇచ్చిండు. ఏ ఇబ్బంది లేకుండే. ఇప్పుడు డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నా. అక్కడింత ఇక్కడింత జమజేసిన డబ్బులతో విత్తనాలు కొని, పొలం దున్ని, నాట్లేసిన. ఇప్పుడు మందులు జల్లడానికి డబ్బుల్లేవు. ఈ కష్టం మా ఊల్లో సానా మంది పడుతున్నరు. డబ్బులు ఎప్పుడత్తయి అని అడిగితే ఎవరూ చెప్తలేరు.
– నిమ్మ మాణిక్యం, రైతు, పెగడపల్లి, జగిత్యాల జిల్లా