Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఈ సీజన్లో అనేక పంటలకు మద్దతు ధర దక్కక రైతులు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా వేరుశనగ, మిర్చి, కంది పంటలు సాగుచేసిన రైతులు అరిగోస పడుతున్నారు. మద్దతు ధర కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందనలేదు. మార్కెట్లో పంటల ధరలు పడిపోయిన వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. పంటల కొనుగోళ్లతోపాటు దళారులను కట్టడి చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శలున్నాయి.
వేరుశనగ, మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ పంటల ధరలు భారీగా పడిపోవడంతో కనీసం పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొన్నది. దీంతో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. నిరుడు మిర్చి క్వింటాల్‌కు రూ.25 వేల ధర పలకగా, ఈ సీజన్లో రూ.12 వేలకు పడిపోయింది. దీనికితోడు మిర్చి పంటకు తామర పురుగు సోకడంతో దిగుబడి కూడా భారీగా పడిపోయింది. ఇటు ధర, అటు దిగుబడి సగానికి సగం పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ధర, దిగుబడి పతనంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొన్నది. వేరుశనగ రైతులది మరో గోస. గడిచిన పదేండ్లలో ఎప్పుడూ వేరుశనగ ధర పతనం కాలేదు. పల్లీకి మద్దతు ధర రూ.6,783 ఉండగా, వ్యాపారులు మూడు నుంచి ఐదు వేలకు మించి ఇవ్వడం లేదు. దీంతో ఆగ్రహించిన రైతులు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అచ్చంపేట మార్కెట్‌పై దాడి చేశారు. మహబూబ్‌నగర్‌లోని బోయపల్లిలో ధర్నా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో వేరుశనగ రైతులు మద్దతు ధర కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ, మిర్చికే కాదు మిగిలిన పంటలకు కూడా ధరలు పడిపోయాయి.
సాధారణంగా మార్కెట్లో పంటలకు మద్దతు ధర దక్కే పరిస్థితి లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి, రైతులకు అండగా నిలబడాల్సి ఉంటుంది. కానీ, ఈ పని జరగడం లేదు. మిర్చి, వేరుశనగ రైతులు ఆందోళనలు చేస్తున్నా, ఈ పంటల కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం. మార్క్‌ఫెడ్ సాధారణంగా మార్కెట్లో ధర లేని పంటలను కొనుగోలు చేస్తుంది కాబట్టి, డిమాండ్ లేని పక్షంలో ఆ పంటలను తర్వాత నష్టానికే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయితే, రైతుల నుంచి మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసి, ఆ తరువాత నష్టానికి అమ్మాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నను ప్రభుత్వ పెద్దలు పలుమార్లు వ్యక్తంచేసినట్టు తెలిసింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వైఖరి రైతులకు శాపంగా మారుతున్నది.
రైతుల నుంచి పంటలు కొనుగోలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్రంపైనే ఆధారపడుతున్నది. మద్దతు ధర తక్కువగా ఉన్న పంటలను కేంద్రం మొత్తం ఉత్పత్తిలో 25% మాత్రమే కొనుగోలు చేస్తుంది. మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వ కోటా ప్రకారం.. పంటల కొనుగోలుకు అనుమతి కోరుతున్నది. రైతులపై ప్రేమ ఉంటే, కేంద్రంతో సంబంధం లేకుండా మొదట రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటల కొనుగోలు ప్రారంభించాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం నుంచి అనుమతులొచ్చే వరకు వేచి చూస్తున్నది. ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ ద్వారా సోయాబీన్, జొన్న, కందులను కేంద్రం కోటాలోనే కొనుగోలు చేయడం గమనార్హం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయలేదు. తాజాగా వేరుశనగ కొనుగోలుకు కేంద్రం అనుమతి కోసం లేఖ రాసినట్టు తెలిసింది. ఈవిధంగా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడటంపై విమర్శలొస్తున్నాయి.
మద్దతు ధర పడిపోయి ఇబ్బంది పడుతున్న కంది రైతులకు.. ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. కందుల కొనుగోలులో కోత పెట్టడమే ఇందుకు కారణం. మార్కెట్లో కందులకు ధర పడిపోవడంతో మద్దతు ధరకు కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎకరానికి మూడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో సగటు దిగుబడి ఎకరానికి 6-8 క్వింటాళ్ల వరకు ఉంటుంది. టీడీఆర్జీ 59 రకంతో అలంపూర్ రైతులు ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు పండిస్తున్నారు. సర్కారు ఎకరానికి మూడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తే ఆ రైతు మిగిలిన 7 క్వింటాళ్లు ఎక్కడ అమ్ముకోవాలనేది ప్రశ్న. ఈ విధానంపై ఆదిలాబాద్, గద్వాల, వనపర్తి, వికారాబాద్, సిద్దిపేట రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సమస్యను గుర్తించిన ఆయా జిల్లాల కలెక్టర్లు కొనుగోలు పరిమితిని ఎకరానికి మూడు క్వింటాళ్ల నుంచి ఆరు క్వింటాళ్లకు పెంచాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
వివిధ పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర, రాష్ట్రంలో వ్యాపారులు కొనుగోలు చేస్తున్న ధర (క్వింటాల్‌కు రూపాయల్లో..)