నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 23: ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం రైతులను కన్నీరు పెట్టిస్తున్నది. 45 రోజులు దాటినా గన్నీ బస్తాలు ఇస్తలేరని, కాంటా పెడ్తలేరని, కొన్ని చోట్ల తూకం వేసినా బస్తాలను తరలించేందుకు లారీ రావడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఓపిక నశించిన రైతులు రోడ్డుపై ధాన్యం పోసి నిప్పు పెడుతున్నారు. శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రోడ్డుపై బైఠాయించారు. గంటపాటు రాస్తారోకో చేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. గజ్వేల్ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం నెలకొంటున్నదని, అధికారులు కనీసం తమను పట్టించుకోవడం లేదంటూ రైతులు రోడ్డుపై ధాన్యం పోసి నిప్పు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమను మోసం చేస్తున్నదని రైతులు మండిపడ్డారు. పండించిన పంటలను కొనుగోలు చేయడం లేదని విమర్శించారు.
గజ్వేల్‌లో కనీసం అధికారులు ఉన్నారా? అనే సందేహం కలుగుతున్నదని అన్నారు. కాగా, ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ మండలం అహ్మదీపూర్ చౌరస్తాలో రైతులు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ యాదాద్రి భవనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేటలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధాన్యం బస్తాలకు నిప్పంటించి నిరసన తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులవుతున్నా లారీల కొరతను సాకుగా చూపుతూ కాంటా పెట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ చేయడంపై వారు మండిపడ్డారు. వడ్లు, మక్కల కొనుగోలులో నిర్వాహకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, తరుగు పేరిట దోపిడీకి పాల్పడుతున్నారని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కారు. రైతులతో కలిసి ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.
మార్కెట్ యార్డులో మక్కలు, ధాన్యం పోసి నెల రోజులైనా కాంటా పెట్టడం లేదని మండిపడ్డారు. పంటను సకాలంలో కొనుగోలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తాకుతుందని హెచ్చరించారు. కాంటా వేసినా ధాన్యాన్ని తరలించడం లేదంటూ నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందకూర్లోని కల్లూరు ప్రధాన రోడ్డుపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దాదాపు వందమందికిపైగా రైతులు 4 గంటలపాటు ఆందోళన చేపట్టగా రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేటలో బీఆర్ఎస్ నాయకుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో నాయకులు, రైతులు కొనుగోలు కేంద్రం వద్ద నిరసన తెలిపారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లారీల కొరత తీర్చాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో రైతులు రోడ్డెక్కారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలు వేసి బైఠాయించారు. 45 రోజులుగా లారీలు రావడం లేదని, 3వేల ధాన్యం బస్తాలు పేరుకుపోయాయని రైతులు మండిపడ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్పూర్లో శుక్రవారం అర్ధరాత్రి రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం బస్తాలను తరలించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నిర్మల్-మంచిర్యాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
రైతుల మహా పాదయాత్ర
ధాన్యం సేకరణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ నుంచి చౌటకూర్ తహసీల్ కార్యాలయం వరకు రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. రైతుల పాదయాత్రకు బీఆర్ఎస్ నాయకుడు, ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నేత మఠం భిక్షపతి, ఇతర నాయకులు సంఘీభావం ప్రకటించి రైతులతో కలిసి నడిచారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో మఠం భిక్షపతి కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. లారీల్లోని ధాన్యాన్ని అన్లోడ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని గోదాముల వద్ద నిర్మల్, ఆదిలాబాద్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మక్క లోడ్లతో వచ్చిన డ్రైవర్లు గోదాము వద్ద ధర్నా నిర్వహించారు. తాము 5 రోజులుగా గోదాముల వద్దే అన్లోడ్ కోసం నిరీక్షిస్తున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. సీసీసీ నస్పూర్ ఎస్సై మేకల ప్రశాంత్ వచ్చి డ్రైవర్లకు నచ్చజెప్పారు.
రైతుకు బాసటగా బీఆర్ఎస్ పాదయాత్ర

ధాన్యం సేకరణలో సర్కార్ వైఫల్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ నుంచి చౌటకూరు తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులతో కలిసి చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నేత మఠం భిక్షపతి తదితరులు
కాళ్లు మొక్కినా కనికరం లేదా?

ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సీఐ రవికుమార్ కాళ్లు మొక్కుతున్న రైతు
కొనేదాకా కదిలేది లేదు..

వడ్లు, మక్కల కొనుగోలులో దోపిడీని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లో ప్రధాన రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
సర్కార్ నిర్లక్ష్యం.. బీఆర్ఎస్ భగ్గు

కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు