వంటగ్యాస్, చమురు, ఆహార ధాన్యాలు.. చివరకు రైళ్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీకి కూడా ‘నో’ చెప్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు.. ఎరువులపై ఇచ్చే సబ్సిడీని మాత్రం పెంచుకొంటూ పోతున్నది. దీనిని చూసి ‘రైతులపై కేంద్రానికి నిజంగా ఎంత ప్రేమ?’ అనుకొనేరు..! సొంత రాష్ట్రం గుజరాత్‌లోని బీజేపీ మిత్రులు, సన్నిహితులకు చెందిన ఎరువుల కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం ఈ నిర్ణయాలని సబ్సిడీ గణాంకాలు చెప్తున్నాయి. నష్టాల్లో ఉన్నాయని చెప్తూ ఒకవైపు ప్రభుత్వ ఎరువుల కర్మాగారాలన్నింటినీ వరుసపెట్టి అమ్మేస్తున్న బీజేపీ సర్కారు.. సబ్సిడీల సొమ్మును ప్రైవేటు కంపెనీల ఖాతాల్లో వేస్తూ వాటిని మరింత పెద్ద చేస్తున్నది. ఈ కంపెనీల్లో చాలావరకు బీజేపీ ఎలక్టోరల్ బాండ్లను కొని మోదీ సర్కారుకు కృతజ్ఞత సమర్పించుకొంటున్నాయని సమాచారం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): వచ్చే యాసంగిలో (అక్టోబర్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకూ) ఎరువులపై రూ. 51,875 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదముద్ర వేసింది. కిందటేడాదితో పోలిస్తే ఇది రూ. 23,220 కోట్లు ఎక్కువ. ఈ ప్రకటన వెలువడింది మొదలు.. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 3,700 వరకు ప్రయోజనం కలుగుతున్నదని కమలం నేతలు ఊదరగొట్టారు. అయితే, ఇక్కడే అసలు నిజాన్ని మరుగున పడేశారు. ఎరువుల సబ్సిడీ ప్రయోజనం అన్నదాతకు దక్కాల్సింది పోయి.. ప్రైవేటు ఎరువుల కంపెనీలకు (ముఖ్యంగా గుజరాత్ కంపెనీలకు) చేరుతున్న విషయాన్ని తొక్కిపెట్టారు.
సబ్సిడీ ప్రయోజనాలు ఎవరికి?
2014లో మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు ఎరువులపై రూ.71,076 కోట్లుగా ఉన్న సబ్సిడీ.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన మొత్తంతో కలిపి రూ. 2.25 లక్షల కోట్లకు చేరుకోనున్నట్టు అంచనా. ఇదే సమయంలో ఎంవోపీ, డీఏపీ, 10:26:26, 28.28.0, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ ధరలను 80 నుంచి 100 శాతం వరకు కేంద్రం పెంచింది. పెరిగిన ధరలకు అనుగుణంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచుతున్నామని, తద్వారా రైతులపై అదనపు భారం పడనీయకుండా చూస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, ఆ సబ్సిడీ ప్రయోజనాలు అంతిమంగా ప్రైవేట్ కంపెనీలకే చేరుతున్నాయి.
సబ్సిడీని ప్రత్యక్షంగా రైతులకు కాకుండా ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం చెల్లిస్తున్నది. దీనికోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) సిస్టమ్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నది. సబ్సిడైజ్డ్ ఎరువుల బ్యాగ్ కావాలంటే అధీకృత పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) కేంద్రం ద్వారా మాత్రమే రైతు కొనుగోలు చేయాలి. అందుకోసం ఆధార్ కార్డు లేదా కిసాన్ క్రెడిట్ కార్డు నంబర్‌ను సమర్పించాలి. దీనికోసం దేశవ్యాప్తంగా 2.3 లక్షల పీవోఎస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీ ధర నుంచి సబ్సిడీ తీసివేయగా వచ్చిన మొత్తాన్ని కొనుగోలు సమయంలో రైతు చెల్లించాలి. లావాదేవీ పూర్తయ్యాక, సబ్సిడీ మొత్తం ఎరువుల ఉత్పత్తిదారు కంపెనీ బ్యాంక్ ఖాతాలో కేంద్రం జమచేస్తుంది. ఒకవైపు ఎరువుల ధరలను పెంచుతూ.. ఆ మేరకు సబ్సిడీలనూ మోదీ సర్కారు పెంచుకుంటూపోతున్నది. రైతులపై భారం పడకూడదనే ఇదంతా చేస్తున్నట్టు చెప్పుకొస్తున్నది. నిజానికి దీని వల్ల అన్నదాతలకు కాకుండా ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు అంతిమంగా లాభం చేకూరుతున్నది. లబ్ధిదారుడికి నేరుగా సబ్సిడీ ఇచ్చే వంటగ్యాస్ వంటివాటిపై సబ్సిడీ ఎత్తేసిన మోదీ సర్కారు.. కంపెనీలకు నేరుగా ఇచ్చే రంగాల్లో సబ్సిడీని మాత్రం ఏటేటా పెంచుతుండటం గమనార్హం.
ఎరువుల కంపెనీల అడ్డా గుజరాత్
దేశంలో ఎరువుల ఉత్పత్తిలో గుజరాత్‌ది అగ్రస్థానం. దేశానికి అవసరమైన ఎరువల్లో 30 శాతానికి పైగా ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ్యంగా ఐఎఫ్ఎఫ్సీవో, క్రిషక్ భారతీ, ఐజీఎస్ఎఫ్సీ, జీఎస్ఎఫ్సీ, జీఎన్ఎఫ్సీ తదితర ప్రైవేట్ కంపెనీల నుంచే అత్యధిక మొత్తంలో ఎరువుల ఉత్పత్తి జరుగుతున్నది. ఈ సంస్థల యజమానుల్లో చాలామంది బీజేపీ మద్దతుదారులనే ఆరోపణలున్నాయి. దీంతో బీజేపీకి లబ్ధిచేకూర్చేలా గడిచిన నాలుగేండ్లలో ఈ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్ల కొనుగోళ్లను పెద్ద ఎత్తున జరిపినట్టు సమాచారం. ఆయా కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికే మోదీ సర్కారు ఎరువులపై సబ్సిడీని పెంచుకుంటూ పోతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు ఎరువుల కంపెనీలను ఇలా సబ్సిడీల రూపంలో నిధులు పెంచుతున్న కేంద్రం.. ప్రభుత్వ రంగంలోని ఎరువుల కంపెనీలను తెగనమ్ముతుండటం గమనార్హం.
మోదీ.. ఇదేమీ?!
మోదీ సర్కారు ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న పీఎస్‌యూలు (ఎరువులు)
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్), నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీవీఎఫ్సీఎల్), ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సం అండ్ మినరల్స్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్ఏజీఎంఐఎల్), మద్రాస్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎల్), ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్), ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్‌కోర్ (ఎఫ్ఏసీటీ), హిందుస్థాన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఎఫ్సీఎల్)