Urea App | నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 23 : యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. రైతు దినోత్సవం రోజైన మంగళవారం కూడా రైతు లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని రైతు వేదిక వద్ద రైతులు యూరియా కోసం అధికారులతో గొడవకు దిగారు. వరంగల్ జిల్లా నెక్కొండలోని సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. క్యూలో తోపులాట జరిగింది.హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో పీఏసీఎస్ వద్ద యాప్‌లో నమోదు ఇబ్బందిగా మారడంతో ఆధార్ నమోదు చేసుకుంటూ పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులోని విక్రయ కేంద్రం వద్ద సగం మందికే పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి రైతులు వేదిక వద్ద రైతులు కూపన్ల కోసం ఎదురుచూశారు.
కడెంలో గ్రోమోర్ వద్ద ధర్నా
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రం ఎదుట ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. సకాలంలో యూరి యా లేకపోతే పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలోని పీఏసీఎస్ గోదాం వద్ద రైతులు బారులుతీరారు. యూరియా లోడ్ వచ్చిందన్న విషయం తెలియడంతో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన రైతులు వందలాదిగా ఉదయమే తరలివచ్చారు. యూరియా దొరుకదేమోనన్న ఆందోళనతో బారులు తీరారు. 900 బస్తాలు రాగా 350 మందికి రెండు నుంచి ఐదు బస్తాల వరకు అందజేశారు. చాలామందికి యూరియా అందకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు.
500 చొప్పున 20 బస్తాలు కొన్న..
అధిక ధరలు వెచ్చించి యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనాల్సి వచ్చింది. 4 ఎకరాల్లో మక్కజొన్న వేసిన. నెల రోజులైంది. యూరియా కార్డులు ఇచ్చినా బస్తాలు దొరకడం లేదు. రూ.500 బస్తా చొప్పున 20 బస్తాలు కొన్న. యూరియా కార్డుల కోసం 5 రోజులు తిరిగిన. ఇప్పుడు అవి పనిచేయవని చెప్తున్నరు. ఫోన్లో యూరి యా ఎట్ల బుక్ చేయాలో తెల్వదు. ఇట్లాయితే ఎవుసం చేసుడు కష్టమే.
– అజ్మీరా రాజన్న, గోపతండా, మం:నర్సింహులపేట, జిల్లా మహబూబాబాద్
యూరియా గోస.. యాసంగి స్పెషల్
యాసంగి మొదలైంది. కాంగ్రెస్ సర్కార్ పుణ్యాన రైతులకు యూరియా గోస మళ్లీ షురువైంది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకొనైనా సరఫరాపై దృష్టి పెట్టని రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు ఎరువుల కోసం మళ్లీ చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాసే దుస్థితి దాపురించింది. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాము వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు