పాన్‌గల్, ఫిబ్రవరి 14 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కష్టాలు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో యూరియాకు కొరత లేదని, రేవంత్ సర్కారు వచ్చాక మళ్లా మునుపటి కష్టాలు మొదలైనట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం సింగిల్ విండో కార్యాలయంలో రైతులు యూరియా కోసం బారులుదీరారు. బస్తాలు తీసుకెళ్లేందుకు ఆటోలతో రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. యూరియా వచ్చిందని తెలుసుకొన్న రైతులు పొద్దుగాలనే పట్టా పాసుపుస్తకాలతో విండో కార్యాలయం వద్దకు చేరుకొని టోకెన్ల కోసం ఎగబడ్డారు. మండల వ్యవసాయ అధికారి రాజవర్ధన్‌రెడ్డి ఒక్కో రైతుకు 5 బస్తాలకు టోకెన్లు అందజేశారు.