Telangana | హైదరాబాద్, మే 25(నమస్తే తెలంగాణ): తొలకరి చినుకు ముందే పలకరించడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడుతున్నారు. అయితే, ఈ సీజన్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలొస్తున్నాయి. రాష్ట్ర అవసరాలకు తగినంత స్థాయిలో ఎరువులు, విత్తనాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవని తెలుస్తున్నది. ముఖ్యంగా యూరియా, పత్తి విత్తనాల కొరత ఏర్పడే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ అధికారులే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ వానకాలంలో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో అత్యధికంగా 66.8 లక్షల ఎకరాల్లో వరి, 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 50 లక్షల ఎకరాల్లో పత్తి, 9 లక్షల ఎకరాల్లో సోయా పంటలు సాగవుతాయని అంచనా వేసింది.
ఈ సీజన్‌కు 9.8 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా. అయితే ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు, ప్రభుత్వం వద్ద కలిపి 3.17 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. రైతులు ఎక్కువగా యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) మీద ఆధారపడతారు. ప్యాక్స్‌కు యూరియాను సరఫరా చేసే మార్క్‌ఫెడ్ వద్ద నిల్వలు అడుగంటినట్టు తెలిసింది. సీజన్‌కు ముందే మార్క్‌ఫెడ్ వద్ద సుమారు 4లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఉండాలి. కానీ, శనివారం నాటికి 1.72 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉన్నది.
ఉండాల్సిన దాని కన్నా 2.28లక్షల టన్నులు తక్కువగా ఉన్నది. ఈ కొరతకు తోడు కేంద్రం నుంచి రావాల్సిన యూరియా రావడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలకు కలిపి 3.3 లక్షల టన్నుల యూరియా రాష్ర్టానికి రావాల్సి ఉండగా 1.72లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. అంటే 1.58 లక్షల టన్నులు తక్కువగా వచ్చింది. ఈ విధంగా మార్క్‌ఫెడ్ బఫర్ స్టాక్ నిల్వలు తక్కువగా ఉండి, కేంద్రం నుంచి రావాల్సిన యూరియా రాకపోవడంతో రాష్ట్రంలో యూరియా కొరత తప్పదనే ఆందోళన వ్యవసాయ శాఖ అధికారుల్లో వ్యక్తమవుతున్నది. ఈ ప్రభావం సాగుపై పడుతుందని, రైతులకు ఇబ్బంది తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎరువులతోపాటు విత్తనాలకు కూడా కొ రత తప్పేలా కనిపించడం లేదు. ముఖ్యంగా గత సంవత్సరం మాదిరిగానే పత్తి, పచ్చిరొట్ట విత్తనాలకు తిప్పలు తప్పేలా లేవు. ఈ సీజన్లో 50లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం కనీసం కోటిన్నర పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం. అయితే వ్యవసాయ శాఖ మాత్రం 2.4 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించింది. కానీ, ప్రస్తుతం 40 లక్షల విత్తన ప్యాకెట్లు మాత్రమే క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీనికితోడు పచ్చిరొట్ట విత్తనాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
ప్రభుత్వం 1.94 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశిస్తే.. విత్తనాభివృద్ధి సంస్థ 97 వేల టన్నులకు మా త్రమే ప్రణాళిక రూపొందించింది. ఇందులో ప్రస్తుతం సగం విత్తనాలే క్షేత్రస్థాయికి చేరినట్టు తెలిసింది. పలు జిల్లాల్లో రైతుకు పచ్చిరొట్ట విత్తనాలు ఒక్క సంచి మాత్రమే ఇస్తున్నట్టు సమాచారం. అది కూడా క్యూలైన్లలో నిలబడితే గానీ లభించడం లేదని చెప్తున్నారు.
గతంతో పోల్చితే ఈ ఏడాది సీజన్ చాలా ముందుకొచ్చింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే రుతుపవనాలు ఇప్పటికే వచ్చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా తొలకరి జల్లులు కురుస్తున్నాయి. దీంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. అధికారులు మాత్రం మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా కదలడం లేదు. జూన్ ప్రణాళిక ప్రకారమే పనిచేస్తున్నారు. ఇప్పుడు సీజన్ సుమారు 20 రోజులు ముందుకు రావడంతో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.