పెబ్బేరు, డిసెంబర్ 18 : జూరాల ప్రాజెక్టు(Jurala project) ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు నీరందకపోవడంతో వనపర్తి (Wanaparthi)జిల్లా పెబ్బేరు మండలానికి చెందిన రైతన్నలు(Farmers) రోడ్డెక్కారు. సోమవారం పట్టణంలోని ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా(Dharna) చేపట్టారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతిచ్చారు. డీ-19 కాల్వ కింద పెంచికలపాడు, జనుంపల్లి, మునగమాన్దిన్నె, సూగూరు, కొత్తసూగూరుతోపాటు పలు గ్రామాల పరిధిలో సుమారు 2వేల ఎకరాల్లో మిరప, ఇతర పంటను సాగు చేసినట్లు రైతులు తెలిపారు.
ప్రస్తుతం పంట చేతికొస్తున్న దశలో జూరాల అధికారులు వారం రోజులుగా నీటి సరఫరాను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నీరందక పంటల సాగు ప్రశ్నార్థకమై ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వారబంది ప్రకారం ఫిబ్రవరి 15 వరకు జూరాల నీరు విడుదల చేయాల్సి ఉందన్నారు. అనంతరం ఎస్ఈ సత్యశీలారెడ్డికి వినతిపత్రం అందజేయగా.. నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.