సంగారెడ్డి, ఆగస్టు17 : ట్రిపుల్ ఆర్కు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. శనివారం సంగారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఏర్పాటు చేసిన సమావేశాన్ని కొండాపూర్ మండలం గిర్మాపూర్, సదాశివపేట మండలం పెద్దాపూర్ రైతులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. అంతకు ముందే ఆయా గ్రామాల్లో ట్రిపుల్ ఆర్కు భూములు ఇచ్చేది లేదంటూ గ్రామస్థులంతా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే ఆయా గ్రామాల మీదుగా జాతీయ రహదారి, పెద్దాపూర్ ఫిల్టర్‌బెడ్, మంజీర పైపులైన్, చెరువులు, కాల్వల నిర్మాణానికి భూములు తీసుకుని తమను కూలీలుగా మార్చారని మండిపడ్డారు. ఇప్పటికే నాందెడ్-అకోలా జాతీయ రహదారి శివ్వంపేట నుంచి కంది ఐఐటీ వరకు వెళ్తున్నదని చెప్పారు.
ఈ రోడ్డును చింతల్పల్లికి జతచేయడంతో చింతల్‌పల్లి, తాళ్లపల్లి, కల్పగూర్, కులబ్గూర్, ఇరిగిపల్లి, గిర్మాపూర్, పెద్దాపూర్‌లో భూసేకరణ మిగిలిపోతుందన్నారు. ప్రభుత్వానికి బడ్జెట్ మిగులుతుందని, ఈ విషయాన్ని గుర్తించి గిర్మాపూర్-పెద్దాపూర్ నుంచి అలైన్మెంట్ మార్చాలని వారు కోరారు. వీరికి రైతు సంఘాల నాయకులు జయరాజు, పృథ్వీరాజ్, టీజేఎస్ తుల్జారెడ్డి మద్దతిచ్చారు.