చివ్వెంల, ఏప్రిల్ 22: ధాన్యం కొంటలేరని కడుపు మండిన రైతులు రోడ్డుపై వడ్లను తగలబెట్టారు. పంటలు కోసి 45 రోజులైనా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా వద్ద ప్రధాన రహదారిపై మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్డుపై పోసి నిప్పు పెట్టి అడ్డంగా కంప వేసి రాస్తారోకో చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ నీళ్లు అందక పంటలు ఎండి కొంత నష్టపోయామని, ఇప్పుడు ధాన్యం కొనకపోతే పూర్తిగా నష్టపోయే పరిస్థితి వస్తదని ఆందోళన వ్యక్తంచేశారు.
ధాన్యాన్ని కొనుగోలు చేసేదాకా కదిలేది లేదని స్పష్టంచేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి రైతుల వద్దకు వెళ్లి మాట్లాడి వారి సమస్యను తెలుసుకొన్నారు. కొనుగోలు విషయంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సూర్యాపేట- దంతాలపల్లి రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో.. తహసీల్దార్, ఎస్సైలు వచ్చి సమస్యను అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ నిరసనలో గుర్రంతండాతోపాటు, ఐలాపురం, గాయంవారిగూడెం, ఎంజీనగర్తండా రైతులు పాల్గొన్నారు.