స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి, మే 25: గిట్టుబాటు ధర కోసం జనగామ జిల్లాలో పొగాకు రైతులు రోడ్డెక్కారు. క్వింటాల్‌కు రూ.18వేల ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై, రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలో పొగాకు పంటకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వీఎస్టీ, డెక్కన్ కంపెనీలు క్వింటాల్ పొగాకు రూ.18వేలు ధర పలుకుతుందని చెప్పడంతో సాగు చేశామని, పంట చేతికొచ్చాక క్వింటాల్‌కు రూ.3వేలు మాత్రమే ఇస్తామంటున్నారని చాగల్లు క్లస్టర్ పరిధిలోని రాఘవాపూర్ రైతులు వాపోయారు.
పండించిన పొగాకును కొనుగోలు చేయకపోతే అప్పులు ఎలా తీరుతాయని ప్రశ్నించారు. వానలకు పొగాకు దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. గిట్టుబాటు ధరకు ఆయా కంపెనీలు పొగాకు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలో రైతులు చేపట్టిన ఆందోళనలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు యాదగిరి మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర కల్పించి పొగాకు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.