Paddy Procurement | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తుతున్నది. అయినప్పటికీ రైతుల గోస పట్టించుకునేవారే లేరు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలుచేసే దిక్కులేదు. ఆ ధాన్యాన్ని తూకం వేసేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. ‘నిబంధనల ప్రకారం తేమ 17 శాతంలోపు ఉంటేనే వడ్లు కాంట పెడుతం. లేదంటే ఎత్తేదే లేదు. మళ్లీ ఆరబెట్టి తీసుకురండి’ అంటూ రైతులకు తెగేసి చెప్తున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే నాశనమవుతుండటంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రికా ర్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుం టే.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసి నా కొనుగోలు కేంద్రాల్లో ధాన్య రాశు లు దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం చెప్పి న కొనుగోళ్లు ఏ మేరకు నిజమనే ప్రశ్న లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. కానీ, వాస్తవానికి 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నదని, ఈ లెక్కన ప్రభుత్వం ఇంకా 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు చెప్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి. ధాన్యం కుప్పలన్నీ నీళ్లలో మునిగి తడిసిపోయాయి. తడిసిన ధాన్యం కొనుగోలుకు అధికారులు ససేమిరా అంటున్నారు. ఆ ధాన్యం నల్లగా ఉన్నదని, మిల్లింగ్‌కు పనికిరాదని చెప్తున్నట్టు తెలిసింది. కొన్ని చోట్ల బలవంతంగా కొనుగోలు చేసినప్పటికీ మిల్లులకు వెళ్లాక ఆ ధాన్యాన్ని మిల్లర్లు తీసకోవడం లేదు. ఒకవేళా తీసుకున్నా క్వింటాలుకు 10-20 కేజీల కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ధాన్యం తడిసిపోయిందని, నల్లగా ఉన్నదని కోతలు పెడుతున్నట్టు ఆరోపిస్తున్నారు. మరోవైపు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రతి గింజా కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ, తడిసిన ధాన్యాన్ని కొనేదే లేదంటూ క్షేత్రస్థాయిలో అధికారులు తెగేసి చెప్తున్నారు. దీంతో మంత్రి మాటలన్నీ ఉత్తవేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలోనూ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు సమయంలో అకాల వర్షాలు కురిశాయి. కానీ, అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించారు. తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకే కొనుగోలు చేయించారు. అలా ప్రతి సీజన్లో సుమారు 5 లక్షల టన్నులకుపైగా తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయించి రైతులకు భరోసా కల్పించారు. ఆ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతులను పట్టించుకునే నాథుడే లేకపోయాడు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించలేదు. కనీసం ఆ దశగా ఒక్క ప్రకటన కూడా జారీచేయలేదు. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండి ప్రకటనలకే పరిమితమవుతున్నారు. దీంతో రైతుల గోస పట్టించుకునేవారు కరువయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.