జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌తో అభివృద్ధి లేకపోగా ఉన్న గూన పెంకులు అమ్ముకునుడే’నని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేశాలపల్లికి చెందిన కౌలు రైతు కొడారి సతీశ్ ఆవేదన వ్యక్తంచేశాడు. సోమవారం వేశాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో కౌలు రైతు సతీశ్.. గండ్ర వెంకటరమణారెడ్డి ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు.
‘యూరియా కోసం నాలుగు రోజులుగా తిరుగుతున్నా.. పట్టా పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డు తీసుకురావాలట.. కౌలుకు తీసుకున్న మేము వారి పట్టా పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులు ఎక్కడికి వెళ్లి తేవాలి.. వాళ్లు హన్మకొండ, హైదరాబాద్‌లో ఎక్కడ ఉంటరో తెల్వదు. వాళ్లు ఇచ్చేదాక మాకు యూరియా ఇవ్వరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇలాంటి కండిషన్లు పెట్టలే. అందరికీ యూరియా ఇచ్చి ఆదుకున్నరు. నాడు కౌలుకు చేసుకున్నోడు బతికిండు.. భూమి చేసుకున్నోడు బతికిండు. అందరికీ రైతుబంధు వచ్చింది. ఇప్పుడు అన్నీ కష్టాలే. సరిగ్గా కరెంట్ కూడా ఉండదు. నాలుగు రోజులు పోతే మళ్లీ బాయిలకాడ కరెంట్ కోసం పడుకునుడే. కేసీఆర్ హయాంలో ఏనాడూ కరెంట్ గోస రాలేదు’ అని కౌలు రైతు సతీశ్ పేర్కొన్నాడు.
‘కాంగ్రెస్‌ను నమ్మి నిండా మునిగినం. వాళ్లు చెప్పిన మాటలు నమ్మి ఓట్లేసినం.. మాకు మంచిగ బుద్ధి చెప్పిండ్రు’ అని భూపాలపల్లి పట్టణంలోని జంగేడు గ్రామానికి చెందిన మహిళా రైతులు వాపోయారు. సొమవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జంగేడు పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం బారులుతీరిన రైతులు, మహిళా రైతులకు కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ‘ఎన్నికలప్పుడు చుక్కలు చూపించిండ్రు. నమ్మినం. రైతుబంధు రాదాయే.. పెట్టుబడి పైసలు రావాయే.. కరెంటు సక్రమంగా ఉండది.. యూరియా కోసం రోజూ లైన్లో నిలబడి ఎదురు చూసుడే. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గోసలు లేకుండే. ఇప్పుడు మాకు కేసీఆరే గుర్తుకు వత్తండు’ అని మహిళా రైతులు గండ్ర వెంకటరమణారెడ్డి ముందు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.