కడ్తాల్, నవంబర్ 6 : గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి తమకు సమాచారం ఇవ్వకుండా భూములను ఎలా సర్వే చేస్తారని రైతులు అధికారులను నిలదీశారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ కందుకూర్, కడ్తాల్ మండలాల మీదుగా ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. రోడ్డుకు సంబంధించి సర్వే పూర్తి చేశారు. ఎక్వాయిపల్లి గ్రామ సమీపం మీదుగా ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణ భూములకు సంబంధించి పరిహరం అందించేందుకు ఆయా భూముల్లో సాగు చేసిన పంటలు, పొలాల్లో ఉన్న చెట్లు, బోరుపంపులు, తాటిచెట్లు, ఉద్యాన పంటల సర్వే పరిశీలనకు గురువారం జిల్లా భూసేకరణ అధికారులతోపాటు, రెవెన్యూ, ఎక్సైజ్, వ్యవసాయ, మిషన్ భగీరథ, ఉద్యాన శాఖలకు చెందిన అధికారులు ఎక్వాయిపల్లికి వచ్చారు.
రైతులతోపాటు ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సర్వేను అడ్డుకున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా పోలీసులతో కలిసి భూ ముల పరిశీలనకు ఎలా వస్తారని నిలదీశారు. భూముల నష్టపరిహారంపై ప్రభుత్వం తమ తో చర్చలు జరపకుండా, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ చ్చారని మండిపడ్డారు. భూమికి భూమి ఇ వ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సర్వే చేపట్టవద్దని రైతులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.