హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రైతు భరోసాపై కాంగ్రెస్ యూటర్న్ తీసుకోవటాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద పోస్టర్లు వెలిశాయి. వరంగల్ డిక్లరేషన్ పేరిట ఎకరాకు రూ.15 వేలు రైతుభరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కానీ, 2024లో ఒక్క రూపాయి విడుదల చేయలేదు.. కనీసం ఈ సంవత్సరమైనా రైతుభరోసా వస్తుందని ఆశించిన రైతాంగానికి రేవంత్ సర్కార్ కోత విధించింది.. అని ‘కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్’ పేరిట మంగళవారం ఏఐసీసీ కార్యాలయ ప్రాంగణంలో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రైతు నిరసన సెగ ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని తాకిందని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. వరంగల్ డిక్లరేషన్ పేరున రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీకి విలువ లేని దుస్థితి నెలకొన్నదని విమర్శించారు.