దండేపల్లి : వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట సమీపంలోని 24 డిస్ట్రిబ్యూటరీ వద్ద తాళ్లపేట, మాకులపేట గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. కడెం ప్రధాన కాలువలోకి దిగి మోకాలి లోతు వరకు కూడా సాగు నీరందడం లేదని చూపించారు. ఇలాగైతే పంటలు కాపాడుకునేదెలా అంటూ వాపోయారు. పంటలకు సరిపడా నీళ్లు ఇస్తామన్న అధికారులు.. పంటలు వేసుకున్నాక చేతులెత్తేశారని మండిపడ్డారు.
పంట ప్రారంభం నుంచి ఎనిమిది తడులు నీరందిస్తామన్నా అధికారులు ఇప్పటి వరకు 4 తడులే అందించారని తెలిపారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరిగేషన్ ఏఈఈ శ్రావణ్ అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.