హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. పంటల అదును దాటుతున్నా.. బస్తా యూరియా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. విక్రయ కేంద్రాల వద్ద అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుడా పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడినా.. పాస్‌బుక్కులు, ఆధార్ జిరాక్స్‌లు.. చివరకు చెప్పులు సైతం వరుసలో పెట్టి నిరీక్షించినా అరకొర యూరియా అందిస్తున్నారని వాపోతున్నారు. అసలే రానివారు మరోరోజు కోసం ఎదురు చూస్తున్నారు. యూరియా కష్టాలు మొదలై నెల దాటినా యాతన తీరలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కడుపుమండిన రైతులు నిరసనకు దిగుతున్నారు. మరికొందరు అధికారులను నిలదీస్తున్నారు.
పనులన్నీ వదిలేసి పడిగాపులు
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో పీఏసీఎస్ గోదాం వద్ద యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు.పనులన్నీ వదిలేసి పొద్దంతా చూసినా బస్తా కూడా దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు
కడుపుమండి.. కన్నెర్ర చేసి..
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని చించోలి-మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై మహిళా రైతులు రాస్తారోకో చేపట్టారు. యూరియా తెప్పించి ఇప్పిస్తామన్న పోలీసుల హామీతో ఆందోళన విరమించారు
అన్నదాత ఆగ్రహజ్వాల
కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలో రైతులు రాస్తారోకో చేపట్టారు. రెండ్రోజులుగా పడిగాపు కాస్తున్నా యూరియా రాలేదని, టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు
యూరియా ఇస్తరా..చావమంటరా..!
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల రైతువేదిక వద్ద రైతు దుర్గయ్య పెట్రోల్ డబ్బాతో ఆందోళనకు దిగాడు. యూరియా ఇస్తరా.. చావమంటరా అంటూ అధికారులను నిలదీశాడు
దండుగా కదిలి.. ధర్నా చేసి..
నల్లగొండ జిల్లా తిప్పర్తిలో నారట్పల్ల్లి అద్దంకి హైవేపై యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. దీంతో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, వ్యవసాయాధికారులు చేరుకొని ఆందోళన విరమింపజేశారు
కష్టం ‘చెప్పు’కోలేక..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌యార్డులో సొసైటీ గోడౌన్ వద్ద క్యూలో నిలబడే ఓపిక లేకపోవడంతో క్యూలో చెప్పులు పెట్టి రైతులు పక్కన సేద తీరారు
రైతుల గోసతో ప్రభుత్వ పతనం ఖాయం
యూరియా కోసం రైతులు పడుతున్న అరిగోస తాకి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పతనమవడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రైతుల అవసరాలకనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తిలోని రాజీవ్ చౌరస్తాలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టగా, ఎర్రబెల్లి హాజరై పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ ఏలుబడిలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారని చెప్పారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతుల ముంగిట్లోకే అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వచ్చాయన్నారు. దేశంలోనే రైతు పక్షపాతిగా గుర్తింపు పొందిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు రాజేందర్, రాజు సిబ్బందితో వెళ్లి ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎర్రబెల్లి అరెస్ట్‌తో గులాబీ శ్రేణులు, బాధిత రైతులు పోలీస్ వాహనాలకు అడ్డు తగలడంతో రాయపర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పచ్చని పల్లెల్లో చిచ్చు..
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట జంగరాయి సొసైటీ ఎదుట రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. చెప్పుల క్యూ పెట్టారు. మహిళలు యూరియా కోసం గొడవకు దిగారు