న్యూస్ నెట్వర్క్ , సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. రాత్రనకా.. పగలనకా.. విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. అదను దాటుతున్న పంటకు వేసేందుకు యూరియా సరిపడా దొరకడంలేదని వాపోతున్నారు. ఓపిక నశించిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు. వ్యవసాయ పనులు మానుకుని రైతులు, ఇంటి పనులు మానుకుని మహిళలు, పాఠశాలలకు వెళ్లకుండా విద్యార్థులు ఆయా కేంద్రాల వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్నారు.
పలుచోట్ల తొక్కిసలాటలు జరుగగా పలువురికి గాయాలయ్యాయి. వర్షాలు పడుతున్నా లెక్కచేయకుండా తడుస్తూ క్యూలో పడిగాపులు పడుతున్నారు. రోజంతా లైన్లో ఉన్నా యూరియా బస్తా దొరకని వారు నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. మార్పుకోసం కాంగ్రెస్‌కు ఓటేసి, రైతులకు మేలు చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని చేజేతులారా పోగుట్టుకున్నామని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్, భూత్పూరులో రైతులు చేపట్టిన ఆందోళనకు మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
పంటలకు సరిపడా యూరియా దొరకకపోవడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
-హుస్నాబాద్
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ఆగ్రో రైతు సేవా కేంద్రానికి యూరియా రాకపోవడంతో మహబూబ్‌నగర్ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రు లు శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సంఘీభావం తెలిపారు. ఆర్డీవో నవీన్, వ్యవసాయ అధికారులు చేరుకుని యూరియా తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
-మహబూబ్‌నగర్
నారాయణపేట జిల్లా మద్దూరు పీఏసీసీఎస్ ఎదుట యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టగా బీఆర్ఎస్ నాయకులతో కలిపి పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి యూరియా కర్ణాటకకు తరలిపోతున్నదని ఆరోపించారు. రైతులను ఆగం చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు.
– మద్దూరు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీ వద్ద ఆదివారం రాత్రి నుంచే రైతులు పడిగాపులు గాశారు. వర్షం తడుస్తూ లైన్ లోనే ఉన్నారు. పోరండ్ల సొసైటీ ఆధ్వర్యంలో మన్నెంపల్లి గోదాంకు రైతులు పెద్ద సంఖ్యలో వర్షంలో బారులు తీరారు.
-తిమ్మాపూర్
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఖమ్మం-వరంగల్ రహదారిపై యూరియా కోసం పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న రైతులు
– మరిపెడ
మంచిర్యాల జిల్లా కోటపల్లిలో వర్షంలో బారులు తీరిన రైతులు
– కోటపల్లి
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని 365 జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గణపతి బప్పా మోరియా.. యూరియా కావాలయ్యా.. అంటూ నినాదాలు చేశారు.
– కురవి
సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 20 టన్నుల యూరియా వచ్చిందని తెలియాగానే వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు
-పుల్కల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో యూరియా కోసం రైతులు సోమవారం రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. వ్యవసాయ పనులు వదులుకొని పొద్దంతా క్యూలో ఉన్నా యూరియా దొరకడం లేదని వాపోయారు.
-టేకులపల్లి
నిర్మల్ జిల్లా లోకేశ్వరం పీఏసీఎస్ వద్ద యూరియా కోసం పాఠశాలకు వెళ్లకుండా మహిళారైతులతో పాటు క్యూలో పడిగాపులు కాస్తున్న విద్యార్థిని – లోకేశ్వరం
రంగారెడ్డి జిల్లా షాబాద్, షాద్‌నగర్, కేశంపేట ప్రాంతాల్లో, వికారాబాద్ జిల్లా ధారూరు, పెద్దేముల్ తదితర ప్రాంతాల్లో రైతులు ఉదయం నుంచే ఎరువుల కోసం దారిపొడవునా బారులు తీరి కనిపించారు.
-పెద్దేముల్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైతు వేదిక వద్ద ఆదివారం రాత్రి నుంచే వర్షం పడుతున్నప్పటికీ భరిస్తూ రైతులు క్యూలో కుటుంబసమేతంగా చంటి పిల్లలను ఎత్తుకొని మరీ నిలబడ్డారు. తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. తొర్రూరు రహదారిపై ధర్నా చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
– కేసముద్రం
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సింగిల్ విండో గోదాం గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే రైతులు బారులు తీరారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా పడిగాపులుకాశారు.
-గంభీరావుపేట
రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ ఐకేపీ మహిళా గ్రూప్ గోదాం వద్ద రైతులకు యూరియా లేదని సిబ్బంది చెప్పడంతో రాజీవ్ చౌక్ వద్ద ధర్నా చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి రైతులకు సంఘీభావం తెలిపారు
– ముస్తాబాద్
యూరియా కోసం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా చేశారు. పోలీసులు రైతులను అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకున్నది. కలెక్టర్ రావాలని పట్టుబట్టడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
– నాగర్‌కర్నూల్
మూసాపేట మండలం గాజులపేటకు చెందిన రైతు అంజమ్మ ఆధార్‌కార్డు పట్టుకొని మహబూబ్‌నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ‘మహనీయుడా.. నీవైనా యూరియా ఇప్పించు అని వేడుకున్నది’
-గోపి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో వేలాది మంది రైతులు రైతులు రావడంతో తోపులాట జరుగగా పలువురికి గాయాలయ్యాయి. మహిళా రైతు అనితకు తీవ్ర గాయాలయ్యాయి. తొర్రూరు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు
-కేసముద్రం
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు సహకార కేంద్రంలో యూరియా బస్తాల కోసం జరిగిన తొక్కిసలాటలో జనగాం గ్రామానికి చెందిన మల్లప్ప స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు అక్కడే ఉన్న ఆటోలో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు
– పెద్దేముల్
కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డి సొసైటీ ఎదుట రాళ్లు, సంచులు వరుసలో పెట్టి పడిగాపులు కాస్తున్న అన్నదాతలు
– నమస్తే తెలంగాణ యంత్రాంగం