Telangana | మానవపాడు/సంగెం/దోమ, జనవరి 20 : రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే సోమవారం మరో నాలుగు జిల్లాల్లో అప్పుల బాధతో నలుగురు యువ రైతులు ప్రాణాలు వదిలారు. వేసిన పంటలు చేతికిరాక.. వచ్చిన పంటకు సరైన మద్దతు ధర లేక.. బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు తనువు చాలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, వరంగల్ జిల్లా సగెం మండలం పోచమ్మతండా, వికారాబాద్ జిల్లా దోమ మండలం అయినాపూర్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ ఘటనలు తెలంగాణలో రైతుల ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దంపడుతున్నాయి.
మానవపాడు మండల కేంద్రానికి చెందిన బొంకురు శేఖర్‌రెడ్డి (32)కి తన తండ్రికి చెందిన మూడెకరాలతో పాటు తన మూడెకరాలు కలిపి మొత్తం ఆరెకరాల పొలం ఉన్నది. కేసీఆర్ హయాంలో సాగునీటికి ఢోకా లేకపోవడం, రైతులకు తగిన ప్రోత్సాహం అందడంతో మరింత కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసేవాడు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక నిరుడు జూరాల లింక్ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న తన ఆరెకరాల్లోనే మిర్చి వేశాడు. సాగునీరు సరిగా అందక దిగుబడి తగ్గింది. కుటుంబ పోషణ భారంగా మారడంతో రూ.8 లక్షల దాకా చేసిన అప్పులు మీదపడ్డాయి. ఈ సరైనా దిగుబడి వస్తుందేమోనన్న ఆశతో పొగాకు, మిర్చి, కంది సాగు చేశాడు. కంది కొనుగోళ్లకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో విక్రయించినా కనీసం పెట్టుబడి కూడా రాలేదు.
పొగాకు పంటకు ప్రైవేట్ ఆర్గనైజర్లు మద్దతు ధర కల్పించకపోవడంతో మరింత దిగులు చెందాడు. ఆర్డీఎస్, జూరాల లింక్ కాల్వలకు నెల రోజులుగా నీటి విడుదల నిలిచిపోవడం.. చీడపీడల నుంచి రక్షించుకున్న మిర్చి పంటకు సరైన సమయంలో నీటి లభ్యత లేక దెబ్బతినడంతో ఈ సారి కూడా అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఇంకా అప్పుల ఊబిలో కురుకుపోతానేమోనన్న భయంతో సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని పంట పొలంలో పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్లిన కొందరు రైతులు గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకొని అతడిని మానవపాడు దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.
సంగెం మండలం పోచమ్మతండా పంచాయతీ పరిధిలోని మహారాజ్తండాకు చెందిన బానోత్ తిరుపతి (39) తనకున్న ఎకరన్నర, కౌలుకు తీసుకున్న నాలుగెకరాల భూమిలో పత్తి, మక్క సాగు చేశాడు. దీంతో అతడికి సుమారు రూ.8 లక్షల దాకా అప్పయింది. పంటలు సరిగ్గా పండక, దిగుబడి రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొంత కాలంగా మనస్తాపంతో ఉన్నాడు. ఈ నెల 18న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి 108లో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
తాను, తన భార్య కలిసి సాగు కోసం చేసిన రూ.2.30 లక్షల రుణం మాఫీ అయ్యే అవకాశం లేదని మనోవేదనకు గురైన రైతు పురుగుల మందు తాగి దాదాపు పదిరోజుల పాటు దవాఖానలో మృత్యువుతో పోరాడి సోమవారం మృతిచెందాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మృతుడి మామ నర్సయ్య, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా ఎల్లపెల్లికి చెందిన పిట్టల లింగన్న (41) 15 ఏండ్ల క్రితం పూర్వ కరీంనగర్..ప్రస్తుత జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన తోకల నర్సయ్య కూతురు లక్ష్మిని పెండ్లి చేసుకున్నాడు.
నర్సయ్యకు కొడుకులు లేకపోవడంతో లింగన్నను ఇల్లరికం తెచ్చుకున్నాడు. భార్య పేరిట రెండెకరాలు, తన పేరిట 34 గుంటలు.. దాదాపు మూడెకరాల్లో దంపతులు సాగు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో లింగన్న పేరిట రూ.80 వేలు, అతడి భార్య పేరిట రూ.1.50 లక్షల పంట రుణం ఉన్నది. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు కొర్రీలు పెట్టడం, రూ.2.30 లక్షల రుణం మాఫీ అయ్యే అవకాశం లేదని, వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
ఇప్పటికే వ్యవసాయ భూమి కొనుగోలు, పంట పెట్టుబడి కోసం దాదాపు రూ.15 లక్షల దాకా అప్పు చేసిన లింగన్న, రూ.2లక్షల రుణమాఫీ కూడా కాకపోవడంతో మనోవేదనకు లోనయ్యాడు. పది రోజుల క్రితం చేనులో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు మెట్పల్లి దవాఖానకు తరలించారు. పది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన లింగన్న సోమవారం మృతిచెందాడు. కేసీఆర్ హయాంలో తమకు రూ.80 వేల రుణమాఫీ అయిందని, ఇప్పుడు రుణమాఫీ కాని బాధలోనే తన అల్లుడు ఆత్మహత్య చేసుకొన్నాడని మామ నర్సయ్య బోరున విలపించాడు. లింగన్న భార్య పిట్ల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసుకున్నారు.
దోమ మండలం అయినాపూర్‌కు చెందిన బ్యాగరి యాదయ్య(35)కు అరెకరం పొలం ఉన్నది. ఇందులో కొంత కాలంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర రూ.రెండు లక్షల అప్పు చేసి నాలుగు బోరు బావులు వేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పాటు పంట పెట్టుబడి కోసం కొడంగల్‌లోని ఓ బ్యాంకులో మరింత అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆదివారం రాత్రి ఇంటి నుంచి పొలానికి వెళ్లి చింత చెట్టుకు ఉరేసుకొన్నాడు. సోమవారం ఉదయం చుట్టు పక్కల రైతులకు యాదయ్య చెట్టుకు వేళాడుతూ కనిపించాడు. అది గమనించిన వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అప్పుల బాధ భరించ లేకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య అంజిలమ్మ చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఆనంద్‌కుమార్ కేసు నమోదు చేసుకున్నారు.