ఇల్లంతకుంట/వీణవంక/దుబ్బాక, ఫిబ్రవరి 1: దిగుబడులు లేక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో రైతులు తనువుచాలిస్తున్నారు. తాజాగా ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని నర్సక్కపేటకు చెందిన తిప్పరవేణి శ్రీనివాస్ (42)కు 10 గుంటల భూమి ఉన్నది. మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఇంటి వద్ద చికెన్ సెంటర్ కూడా నడుపుతున్నాడు. గతంలో శుభకార్యాలకు సొంతంగా పెండ్లి బ్యాండ్ నిర్వహించాడు. గిట్టుబాటు కాకపోవడంతో దాన్ని మూసివేసి మరొకరు నిర్వహించే బ్యాండ్‌లో కూలీగా వెళ్తున్నాడు. ఎన్ని పనులు చేసినా పెట్టుబడులు రాకపోవడం, దాదాపు రూ.15 లక్షల దాకా అప్పులు కావడంతో తీర్చేదారి లేక కలత చెందాడు. శనివారం ఉదయం తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్‌కు భార్య దేవలక్ష్మి, కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కదిరె శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
మల్లన్నపల్లిలో మహిళా రైతు
కరీంనగర్ జిల్లా వీణవంక మండ లం మల్లన్నపల్లికి చెందిన నామిని ఉమాదేవి-శ్రీనివాస్ దంపతులు. నాలుగెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా, పంటలు సరిగా పండకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. అదీగాక మూడేండ్ల కిందట ఇల్లు కట్టుకోగా రూ.20 లక్షల అప్పు అయింది. సాగు కలిసి రాక.. చేసిన అప్పు ఎలా తీర్చా లో తెలియక ఉమాదేవి తీవ్ర మనసా ్తపం చెందింది. శుక్రవారం ఉద యం ఇంట్లో ఎవరూ లేని సమయం లో గడ్డిమందు తాగింది. గమనించిన భర్త నామిని శ్రీనివాస్ హనుమకొండలోని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
ధర్మాజీపేటలో లక్ష్మణ్
సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ధర్మాజీపేటకు చెందిన రైతు పూ రి లక్ష్మణ్ (49) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మాజీపేట-చౌదర్పల్లి గ్రామాల శివారులో పూరి లక్ష్మణ్‌కు రెండెకరాల భూమి ఉన్నది. వ్యవసాయం కలిసి రాలేదు. రెండేండ్ల కిందట ధర్మాజీపేటలో ఇల్లు నిర్మించాడు. అందుకోసం అప్పు చేశాడు. ఓ పక్క అప్పులు తీర్చే మార్గం లేక మరోపక్క పెండ్లి ఈడుకొచ్చిన కూతురు ఉండటంతో మానసికంగా కలత చెందాడు. కూతురి పెండ్లి కి డబ్బు లేక మనోవేదనకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి 11 గంటలకు లక్ష్మణ్ పొలానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా వ్యవసాయ బావి పక్కన టేకు చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతూ కన్పించాడు. భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.