హైదరాబాద్, జూన్ 19 (నమస్తేతెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులకు సంకెళ్లు వేయడంపై తెలంగాణ రైతు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జూన్ 4న నిరసన వ్యక్తం చేసి, విధ్వంసం సృష్టించారనే ఆరోపణలతో 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అలంపూర్ కోర్టుకు హాజరుపరిచే సమయంలో సంకెళ్లు వేసి తీసుకెళ్లారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గురువారం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లా ఎస్పీ టీ శ్రీనివాస్‌రావుకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేయడం అమానవీయమని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు ఏఆర్ఎస్ఐలను సస్పెండ్ చేసినట్టు చైర్మన్ ఏ కోదండరెడ్డికి ఎస్పీ వివరించారు.
రైతులకు మొబైల్ ఫోన్లు ఇవ్వని పోలీసులు
అయిజ/అలంపూర్, జూన్ 19 : పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దన్న రైతులపై పోలీసులు కేసులు బనాయించి జైలుకు పంపించిన విష యం విదితమే. రైతులను అరెస్టు చేసిన సమయంలో వారి వద్దనున్న మొబైల్ ఫోన్లు పోలీసులు రాజోళి పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేశారు. 14 రోజుల తర్వాత బెయిల్‌పై వచ్చిన రైతులు గురువారం వారి మొబైల్ ఫోన్లకోసం పోలీస్ స్టేషన్‌కు రాగా మరోరోజు రావాలని స్టేషన్ ఇన్చార్జి శిక్షణ ఎస్సై సతీశ్‌రెడ్డి చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.
‘భూదాన్’ సమస్యను పరిష్కరించరా?
భువనగిరి కలెక్టరేట్, జూన్ 19 : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరిలో గురువారం భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. అయితే తమ గ్రామ పరిధిలోని 518 సర్వే నంబర్‌లోగల వందలాది ఎకరాలు పూర్తిగా భూదాన్ భూమిగా నమోదైందని వడాయిగూడెం రైతులు ఆందోళనకు దిగారు. దీంతో తమకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలేవీ వర్తించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే రికార్డుల నుంచి 518 సర్వే నంబరుకు మినహాయింపు కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ సమస్య తన పరిధిలో లేదని తహసీల్దార్ అంజిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి భూ సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు విన్నవించారు.
సాగుభూములను గుంజుకుంటరా?
మాచారెడ్డి, జూన్ 19: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్‌లో గురువారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. యాభై ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దళితులు వాపోయారు. గురువారం అటవీశాఖ అధికారులు పోలీసులతో వచ్చి ఆయా భూముల్లో ఒడ్లను తొలగించి ట్రెంచ్ కొట్టించారు. దీంతో అధికారులు, దళితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ భూముల్లో ప్లాంటేషన్ చేస్తుంటే ధ్వంసం చేస్తున్నారని మాచారెడ్డి ఎఫ్ఆర్వో దివ్య తెలిపారు. అటవీ భూములు కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రంగంపేటలో పోడు రైతుల ఆందోళన
వీర్నపల్లి, జూన్ 19: ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు గుంజుకుంటే ఊరుకునేది లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట రైతులు హెచ్చరించారు. సదరు భూముల్లో ప్లాంటేషన్ చేస్తే తమకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు. గ్రామంలో పట్టాలు లేని భూముల్లో సర్వే చేసేందుకు రెండోరోజైన గురువారం కూడా ఎఫ్ఎస్వో పద్మలత, బేస్ క్యాంపు సిబ్బంది అకడికి చే రుకోగా, పోడు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాగు భూముల్లోకి అధికారులను వెళ్లనీయకుడా రోడ్డుపైనే బైఠాయించారు. 30 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములు లాక్కుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. దీంతో సర్వే చేపట్టకుండానే అధికారులు వెనుదిరిగారు.
‘పొద్దుతిరుగుడు’ డబ్బులు ఇంకెప్పుడిస్తరు?
పొద్దుతిరుగుడు ధాన్యం డబ్బులు ఇంకెప్పుడు చెల్లిస్తరంటూ రైతులు ఆందోళనకు దిగారు. 75 రోజులు గడుస్తున్నా డబ్బులు అందకపోవడంతో గురువారం సిద్దిపేట జిల్లా తొగుట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. సొసైటీ చైర్మన్ కే హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. తొగుట సెంటర్ పరిధిలో నాలుగు వందల మంది రైతులకు రూ.3 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని అన్నారు. -మిరుదొడ్డి