సూర్యాపేట, జూలై 7 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరంలో భాగమైన కన్నెపల్లి వద్ద పంపులను వెంటనే ఆన్ చేసి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలని సూర్యాపేట జిల్లా రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వర్షాలు లేక కరువు ఛాయలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేసి లక్షలాదిగా రైతులు కన్నెపల్లికి తరలివచ్చేంత వరకు వేచి చూడొద్దని హెచ్చరించారు. మంగళవారం సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టరేట్ కార్యాలయ ముట్టడి, ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రాజెక్టు ఎవరు నిర్మించారనే విషయాన్ని పక్కనపెట్టి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను తక్షణమే ప్రారంభించి, ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏటా సకాలంలో నీరందించి రైతాంగాన్ని ఆదుకున్నదని గుర్తుచేశారు. గోదావరి జలాలను విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.