మాగనూరు, జనవరి 10 : నారాయణపేట జిల్లా గజరందొడ్డి వాగు నుంచి ఇసుక తరలింపును స్థానికులు అడ్డుకున్నారు. టీజీఎండీసీ ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతులు ఉండగా.. ఇక్కడి నుంచి తరలించొద్దంటూ చిట్యాల, మందిపల్లి, గజరందొడ్డి గ్రామాల రైతులు హెచ్చరిస్తూ వచ్చారు. అయినా వినకుండా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అధికారులు, కాంగ్రెస్ నాయకుడు మొండి వైఖరితో శనివారం టిప్పర్లను వాగులోకి తీసుకొచ్చి ఇసుక తరలించేందుకు సిద్ధమయ్యారు.
విషయం తెలుసుకొన్న రైతులు అక్కడికి చేరుకొని ఇసుక తరలింపును అడ్డుకున్నారు. అప్పటికే టిప్పర్లో లోడ్ చేసిన ఇసుకను ఖాళీ చేయించారు. అనుమతి ఉన్నా ఎందుకు తరలింపును అడ్డుకుంటున్నారని పోలీసులు ప్రశ్నించారు. వాగును తోడేస్తే ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీజీఎండీసీని వెంటనే రద్దుచేసి ఇసుక తరలింపు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ నేత యత్నించినా వినకపోవడంతో చేసేది లేక వెనుదిరిగారు.