పాలకుర్తి/ధన్వాడ/కొత్తగూడెం గణేశ్టెంపుల్/ కారేపల్లి, మే 31: ధాన్యం కొనాలంటూ రైతులు నిత్యం ఆందోళనలకు దిగుతున్నారు. ఆదివారం కూడా పలుచోట్ల రోడ్లెక్కారు. పంటకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఈరవెన్ను గ్రామంలో కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడిచినా కొనకపోవడంతో రైతులు పంటకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. వానకాలం సమీపిస్తున్నా ధాన్యం కొనరా? అంటూ మండిపడ్డారు. కలెక్టర్ ఆదేశాలను తొర్రూరు బ్యాంక్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులకు విన్నవించినా, కలెక్టర్కు చెప్పినా ఫలితం లేదని వాపోయారు. బస్తాకు రెండు కిలోలు కోతకు ఒప్పుకొంటేనే నిర్వాహకులు కాంటా పెడుతున్నారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో కడుపుమండిన రైతు జక్కుల రాజు భోరున విలపిస్తూ కొనుగోలు కేంద్రంలోనే తన ధాన్యానికి నిప్పు పెట్టాడు.
తరుగు పేరిట దోపిడీ
మిల్లులకు తీసుకువచ్చిన ధాన్యంలో 17 నుంచి 21 బస్తాల వరకు తరుగు తీయడాన్ని నిరసిస్తూ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం చర్లపల్లి పంచాయతీ వద్ద మక్తల్, జక్లేర్, తీలేరు గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. మక్తల్ రైస్ మిల్లుకు 815 బస్తాల ధాన్యాన్ని తూకం వేసి పంపిస్తే 794 బస్తాల డబ్బులు వేశారని, 21 బస్తాల తరుగు తీశారని వాపోయారు. మరో రైతు 796 బస్తాలకు 784 బస్తా డబ్బులు వేశారని, తీలేరుకు చెందిన రైతుకు చెందిన బస్తాల నుంచి 17 బస్తాల తరుగు తీశారని, ప్రతి లారీకి 20 బస్తాల వరకు తరుగుతీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీ లోడుకు రూ.2 వేలు కిరాయి చెల్లించామని, హమాలీ చార్జీలు కూడా ఇచ్చినా మిల్లర్లు తరగు పేరుతో 17 నుంచి 20 సంచుల వరకు తరుగు తీయడం అన్యాయమని అన్నారు.
కాగా కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో ఎమ్మెస్పీ జిరాక్స్ ప్రతులను దహనం చేశారు. పంటలకు సరైన ధరలు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయడం సరైందికాదని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్స య్య, అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లి హాలియాతండా వద్ద సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.