సాగును పండుగలా మారుస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అరిగోస పెడుతున్నది. సాగునీటి కొరతను పక్కన పెడితే.. కరెంట్ సరఫరాలో కోతలతో ముప్పుతిప్పలు పెడుతున్నది. ఎవుసానికి ఇచ్చిన విద్యుత్‌లోనూ రోజుకు ఐదారుసార్లు కట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నది. లో వోల్టేజీ సమస్య ఏర్పడి మోటర్లు కాలిపోతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. గంగాధర మండలం చెర్లపల్లి(ఎన్)లో సమస్య తీవ్రంగా ఉన్నా.. పరిష్కారం కరువైంది. నాటి కేసీఆర్ పాలనలో లేని సమస్య, ఇప్పుడెందుకు సృష్టిస్తున్నారని, నీరందక వరి నారు ఎండిపోతున్నదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.
గంగాధర, జూలై 21: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి(ఎన్) గ్రామంలో సుమారు 145 మంది రైతులు ఉండగా, 600 ఎకరాల ఎవుసం భూమి ఉంది. గ్రామంలో 16కేవీ, 25 కేవీ సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్లు 35 ఉండగా, దాదాపు 200 వరకు ఉన్న కరెంటు మోటర్ల ద్వారా పొలాలకు నీరందుతున్నది. అయితే ఈ వానకాలం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో రైతులు పూర్తిస్థాయిలో పంటలు సాగు చేయలేదు. బావులు, బోర్లలో ఉన్న కొద్దిపాటి నీటితో నార్లు పోసి, నాటు వేసుకుంటున్నారు.
అయితే సాగుకు కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు బంద్ చేయడం, పగటిపూట ఇచ్చిన కరెంటులోనూ తీవ్రమైన కోతలు విధిస్తుండడంతో నారు మడులతో పాటు సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. ఇచ్చిన గంట సమయంలో నాలుగైదు సార్లు ట్రిప్ అవుతుండగా, గుంట పొలం పారడం లేదని, పొద్దంతా పొలాల వద్దే పడిగాపులు పడాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు లోవోల్టేజీ సమస్య పెరిగి మోటర్లు కాలిపోతున్నాయని, విద్యు త్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కేసీఆర్ హయాంలో ఎవుసానికి 24 గంటల కరెంటు ఇచ్చారని, అప్పుడు ఏ బాధా లేదని, కానీ కాంగ్రెస్ ఇచ్చి నిరంతర కరెంట్‌కు మంగళం పాడి కోతలతో ఇబ్బందులు పెడుతున్నదని రైతులు మండిపడుతున్నారు.
ఎప్పుడస్తదో తెలుస్తలేదు
నాకు ఆరెకరాల ఎవుసం భూమి ఉన్నది. నీళ్లు లేక మూడెకరాలు మాత్రమే పొలం వేయాలని నారు పోసి దున్నిచ్చిన. ఎకరంలో నాటు వేస్తే అతి కష్టం మీద పారుతంది. రాత్రి కరెంటు బందైతంది. ఎప్పుడు వస్తదో తెలుస్తలేదు. ఇచ్చినప్పుడు కూడా గంటకు నాలుగు సార్లు ట్రిప్ అయితుంది. ఏం చేయాలో తెలియక మిగిలిన రెండెరాలలో నాటు వేయకుండా విడిచిపెట్టిన. నారు ముదిరిపోయింది. లోవోల్టేజీతోని మోటర్లు కాలిపోతున్నయి. సర్కారు 24 గంటల కరెంటు ఇచ్చి మా రైతులను ఆదుకోవాలి.
– ఎడవెల్లి కరుణాకర్‌రెడ్డి, రైతు
కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చిండు
కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఎవుసానికి 24 గంటల కరెంటు ఇచ్చిండు. మా రైతులం ఎప్పుడంటే అప్పుడు పొయ్యి కరెంటు పెట్టుకున్నం. ఇప్పుడు అట్ల లేదు. రోజుకు నాలుగైదు గంటల కంటె ఎక్కువ ఉంటలేదు. దీంతో షానా ఇబ్బందైతంది. లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నయి. పొలాలు సక్కగ పారక ఎండిపోతున్నాయి. అనాడు కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చినప్పుడు ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఎందుకు ఇత్తలేడు. రైతుల మీద ప్రేమ ఉండాలె, కరెంటు మీద అవగాహన ఉంటేనే వస్తది.
– పొట్టల కనకయ్య, రైతు