హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పత్తి రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రైవేటు వ్యాపారులతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సైతం మద్దతు ధర చెల్లించడం లేదు. రాష్ట్రంలో పత్తి సాగుకు ప్రధాన కేంద్రమైన ఆదిలాబాద్ మారెట్లో అక్టోబర్ 30న సీసీఐ చేసిన కొనుగోళ్లే ఇందుకు నిదర్శనం. ఆ రోజు 8 మంది రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసిన సీసీఐ ఏ ఒకరికీ పూర్తి మద్దతు ధర చెల్లించలేదు. తేమ పేరుతో కొర్రీలు పెట్టి, కొనుగోలు ధరలో కోత విధించింది. క్వింటా పత్తికి రూ.8,110 చొప్పున చెల్లించాల్సి ఉండగా.. రూ.7,786 మాత్రమే చెల్లించింది. దీంతో రైతులకు మద్దతు ధర కంటే రూ.324 తకువ వచ్చింది.
పత్తి కొనుగోలులో 12% తేమ నిబంధన రైతులకు పెనుశాపంగా మారింది. రాష్ట్రంలో గత రెండు నెలల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి మొత్తం తడిసి ముద్దయింది. అయినప్పటికీ తేమ 12% మించరాదని సీసీఐ పట్టుబడుతున్నది. అంతకు మించితే పత్తి కొనుగోలు చేసే ప్రసక్తే లేదని, తేమ 8% ఉంటేనే క్వింటాకు రూ.8,110 మద్దతు ధర చెల్లిస్తామని చెప్తున్నది. 8% కంటే తేమ ఎంత ఎక్కువ పెరిగితే కొనుగోలు ధరలో అంత ఎక్కువగా కోత పెడుతున్నది. తేమ 9% ఉంటే రూ.8,029, 10% ఉంటే రూ.7,948, 11% ఉంటే రూ.7867, 12% ఉంటే రూ.7,786 చొప్పున చెల్లిస్తున్నది. దీంతో పత్తి రైతులెవరికీ మద్దతు ధర దకడం లేదు.
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు మొదలై 15 రోజులు కావస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. మొత్తం 322 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయగా.. ఇప్పటివరకు 150 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. వాటిలోనూ కేవలం 100 కేంద్రాల్లోనే కొనుగోళ్లు మొదలైనట్టు సమాచారం. ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఎల్1, ఎల్2, ఎల్3 నిబంధనే ఇందుకు ప్రధాన అడ్డంకిగా మారినట్టు తెలిసింది. ఎల్1గా ఎంపికైన మిల్లు సామర్థ్యం పూర్తిగా నిండిన తర్వాతే ఎల్ 2, ఎల్ 3 మిల్లులకు పత్తి కేటాయిస్తారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పత్తి కొనుగోలు ప్రారంభంకాక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకొచ్చి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరుసుకోకపోవడం, తెరుచుకున్న చోట తేమ పేరుతో కోర్రీలు పెడుతుండటంతో రైతులు దికుతోచక తకువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని విక్రయించి నష్టాల పాలవుతున్నారు.