ఓ వైపు నీళ్లు లేక.. మరోవైపు కరెంట్ రాక ఎండుతున్న పంటలతో రైతులు పడుతున్న గోస సీఎం రేవంత్‌రెడ్డికి తెలుస్తలేదా? అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మల్లన్నపల్లిలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతు బండారు స్వామి మాట్లాడుతూ ఎకరంన్నర వరి వేయగా పొట్టకొచ్చినంక నీళ్లు లేక ఎండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ సందర్భంగా ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి. వాటిని చూస్తుంటే కన్నీరొస్తుంది. పంటలు చేతికి రాక.. అప్పుల భారం మోయలేక చావడమే మేలనిపిస్తున్నది. మూడు ఎకరాలు వరి వేస్తే రూ.లక్షల్లో అప్పు మిగిలింది. నీరు లేకపోవడంతో చేతికొచ్చిన పంట పశువులపాలవుతుంటే గుండెలు పగిలిపోతున్నాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలి.
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం నేరళ్లపల్లి శివారులోని గుడిబండ తండాకు చెందిన రైతు భోజ్యానాయక్ ఎకరా పొలంలో వరి సాగు చేశాడు. ఆ తరువాత భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటగా బోరులోంచి చుక్కనీరు రాకపోవడంతో పంట ఎండిపోతున్నది. చేసేది లేక ఎండిన వరి పంటను రైతు భార్య నేనావత్ సక్రి కోసి పశువులకు గ్రాసంగా వేసింది. ఇదేమిటని ప్రశ్నిస్తే బోర్లల్లో నీరు లేదు.. పశువులైనా కడుపునిండా గ్రాసాన్ని తింటాయని ఆవేదన వెలిబుచ్చింది.
పదేండ్లపాటు సంతోషంగా పంటలు పండించుకున్న రైతాంగం ప్రస్తుతం సాగునీటి సమస్యతో కుదేలవుతున్నది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్‌పల్లికి చెందిన నరేందర్‌కు పదెకరాల పొలం ఉన్నది. సాగునీటి సమస్య తలెత్తడంతో యాసంగిలో ఐదెకరాల్లోనే నాట్లు వేశాడు. పంట ప్రస్తుతం పొట్ట దశలో ఉండగా బోర్లు ఎత్తిపోయాయి. 400 ఫీట్ల దాకా బోర్లు వేసినా చుక్కనీరు రాలేదు. ఉన్న కాస్తంత నీళ్లు ఎత్తిపోసే మోటరు కాలిపోయడంతో కష్టాలు రెట్టింపయ్యాయి.