చెన్నారావుపేట/సంగెం/కురవి, డిసెంబర్ 9: యూరియా కోసం రైతులు చలిలో నిలబడలేక అరిగోస పడుతున్నారు. మంగళవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట, సంగెం, మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఎరువుల కోసం అన్నదాతలు పెద్ద ఎత్తున బారులు తీరారు. వర్షాకాలంలో ఇబ్బందులు పడ్డా యాసంగి పంటకైనా సరిపడా యూరియా అందుతుందని ఆశతో మక్క, వరి పంటలు వేశామని, అయినప్పటికీ తిప్పలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
చెన్నారావుపేట సహకార సంఘం వద్ద అన్నదాతలు చలికి దుప్పట్లు కప్పుకొని టోకెన్ల కోసం క్యూ కట్టారు. సంగెం గ్రోమోర్ కేంద్రంలో యూరియా పంపిణీని కలెక్టర్ సత్యశారద తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. కురవిలో క్యూలో నిల్చున్న రైతులతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. యూరియా పంపిణీలో ఆలస్యం ఎందుకు అవుతున్నదని ఏవో నర్సింహారావును సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. కలెక్టర్‌తో మాట్లాడుతానని, ప్రైవేటు షాపుల్లో ఉన్న యూరియాను ఇప్పించాలని ఏవోకు సూచించారు.