నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 7 : యూరియా కోసం రైతులు సొసైటీల వద్దకు పరుగులు తీస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గజగజ వణికించే చలిలో బారులుతీరుతున్నారు. పొద్దంతా క్యూలో నిరీక్షించినా యూరియా బస్తాలు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం ఖానాపురం రైతు వేదిక వద్ద బుధవారం తెల్లవారుజామునే రైతులు భారీగా చేరుకున్నారు. అధికారులు వచ్చే వరకు నిల్చునే ఓపిక లేక పాస్ పుస్తకాలు క్యూలో పెట్టారు. చలికి తట్టుకోలేక పక్కన చలిమంటలు వేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్లోని వ్యవసాయ గిడ్డంగి వద్ద రైతులు బస్తాల కోసం బుధవారం తెల్లవారుజాము నుంచే చలిలో బారులు తీరారు. మంగళవారం రాత్రికే ఆధార్ కార్డు జిరాక్స్లు, చెప్పులు, రాళ్లు వరుసలో పెట్టారు. తెల్లవారుజాము నుంచి లైన్లో నిల్చున్నారు. కొద్ది మందికే బస్తాలు దొరకడంతో మిగతా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండల రైతులకు ప్రభుత్వం యూరియా కార్డుల పంపిణీ చేసింది. మద్దూరు పీఏసీఎస్ క్యాష్ కౌంటర్ వద్ద రైతులు యూరియా కోసం కార్డులు పట్టుకొని బారులుదీరారు. సరిపడా యూరియా ఇవ్వకపోతే ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బుధవారం మధ్యాహ్నం రైతులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సుంకిడి, రాయిగూడ, కొండాపూర్ గ్రామాల నుంచి వంద మందికిపైగా రైతులం యూరియా యాప్లో స్లాట్ బుక్ చేసుకున్నామని, మండల కేంద్రంలోని సంగీత ఫర్టిలైజర్ షాపునకు వచ్చినట్టు తెలిపారు. యాప్లో రూ.266 బస్తా ధర ఉంటే షాపు యజమాని రూ.320కు బస్తా ఇస్తామనడం దారుణమని అన్నారు.
యూరియా బస్తాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు రాసుకుని పొమ్మంటున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గోప్యాతండాకు చెందిన గిరిజన రైతు గుగులోత్ పెద్ద శ్రీను ఆవేదన వ్యక్తంచేశాడు. తాను ఈ నెల 2న దంతాలపల్లిలోని సొసైటీ గోదాము వద్ద అధికారులను యూరియా కోసం అడగ్గా.. 8 బస్తాలు ఇచ్చినట్టు ఉట్టి చేతులతోనే పంపించి వేశారని ఆందోళన వ్యక్తంచేశాడు. ఈ విష యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.