Paddy Procurement | నర్సింహులపేట, మే 1 : కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు బస్తాలు లేక.. మరోవైపు లారీలు రాక.. ఇంకోవైపు అకాల వర్షాలు, అసౌకర్యాలు.. వెరసి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల వద్ద కంటిమీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంతోపాటు పెద్దనాగారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, ముంగిమడుగు, వంతడపలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అసౌకర్యాలతో రైతులు అవస్థలు పడుతున్నారు.
ముంగిమడుగు కొనుగోలు కేంద్రంలో బస్తాలు అందుబాటులో లేక కాంటాలు నిలిచాయి. కాంటా పెట్టిన 4,980 బస్తాల్లో ఇంకా 3,200 బస్తాలు లారీలు రాక అక్కడే ఉండిపోయాయి. నర్సింహులపేటలో 15,103 బస్తాలు కాంటాలు పెట్టగా, ఇంకా 7,021 బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. పెద్దనాగారంలో 7,021 బస్తాలు కాంటాలు పెట్టగా, 4,157 బస్తాలు కేంద్రంలో ఉన్నాయి. దీంతో ధాన్యం కాంటా పెట్టిన రైతులు, కాంటాలు పెట్టాల్సిన రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులుకాయాల్సి వస్తున్నది..
నేను ఇరవై రోజుల క్రితం వడ్లు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. మొదట్లో హమాలీలు లేరని చెప్పారు. హమాలీలు వచ్చిన తర్వాత కొంతమంది రైతుల ధాన్యం కాంటా పెట్టారు. మళ్లీ ఇప్పుడేమో బస్తాలు రాలేదని కాంటాలు పెట్టడం లేదు. వాన వస్తుంది.. ఎండిన వడ్లు తడుస్తున్నాయి. మా బాధలను అర్థం చేసుకునే వారే లేరు.
– బానోత్ సంతోష్, గోల్బోడ్కతండా
తమకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదని ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే) గ్రామస్తులు దేవుళ్లపై ఒట్టేసి నిరసన తెలిపారు. గురువారం ఇచ్చోడలోని శివాలయం వద్ద దేవుళ్లపై ఒట్టేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ అన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయని అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. ముక్రా(కే)లో సగం మందికే రుణమాఫీ, రైతు భరోసా వచ్చిందన్నారు. ప్రతి రైతుకూ రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
– ఇచ్చోడ
వరి కోతలు ప్రారంభమై నెల రోజులైనా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వీరాపూర్కు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. గురువారం వీరు ఉప్పుమడుగు-ఆలూర్ ఎక్స్ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని ధోబీఘాట్ వద్ద కుప్పలు పోసి చాలా రోజులవుతున్నా అధికారులు ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదని మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. జిల్లా సహకార అధికారి సీహెచ్ మనోజ్ కుమార్, తహసీల్దార్ అబ్దుల్ ఖయ్యూం రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
– రాయికల్
పంట అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా చాలాచోట్ల కొనుగోళ్లు చేయడం లేదని, ఉన్న కేంద్రాల్లో కాంటా పెట్టడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో అనేకచోట్ల ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. తాండూరు మండలం చెంగోల్ బైపాస్ రోడ్డు సమీపంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని రైతు లాలప్ప ఆవేదన వ్యక్తంచేశాడు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్నామని పలువురు రైతులు పేర్కొన్నారు. రోడ్డుపై ఎంతకాలం ఉండాలని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
– కొడంగల్/తాండూరు రూరల్
మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. గురువారం నారాయణపేట జిల్లా మాగనూరు ఉమ్మడి మండలంలోని వడ్వాట్ గేటు వద్ద జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పరిమితి లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల హామీ మేరకు రైతులు ఆందోళన విరమించారు.
– మాగనూరు
గన్నీ బ్యాగులు సరిపడా లేక అష్టకష్టాలు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పెద్దజట్రంలోని రైతు వేదిక వద్ద పెద్దజట్రంతోపాటు బిజ్వారం, అవుసలోనిపల్లికి చెందిన రైతులు నిరసన తెలిపారు. వెంటనే బ్యాగులు అందించాలని వారు డిమాండ్ చేశారు.
– ఊటూర్